భక్తజన సంద్రమైన వాడపల్లి
కొత్తపేట: ఏడు వారాలస్వామి వాడపల్లి వెంకన్న ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రానికి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు. దేవస్థానానికి ఒక్క రోజు ఆదాయం రూ 62.53 లక్షలు సమకూరినట్టు ఈఓ తెలిపారు. సాధారణ భక్తులతో పాటు ఏడు శనివారాలు.. ఏడు ప్రదక్షిణ చేస్తున్న భక్తులతో వాడపల్లి క్షేత్రం భక్తజన సంద్రమైంది. అనంతరం తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. ఎస్సై రాము ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరణ, బందోబస్తు నిర్వహించారు.
ఒక్క రోజు ఆదాయం
రూ.53.36 లక్షలు
వాడపల్లి క్షేత్రానికి వేలాదిగా తరలివచ్చిన భక్తుల విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ఆన్‌లైన్, నిత్య, శాస్వత అన్నదానం విరాళాలు, లడ్డు విక్రయం తదితర రూపాల్లో శనివారం ఒక్కరోజు రాత్రి 9 గంటల వరకూ దేవస్థానానికి రూ.53,36,577 ఆదాయం వచ్చినట్టు ఈఓ చక్రధరరావు తెలిపారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా రాత్రి రావులపాలేనికి చెందిన సాయి నటరాజ కళాపీఠం కళాకారిణుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వారికి దేవస్థానం వారు మెమెంటోలు అందచేశారు.
శనైశ్చరుని ఆదాయం రూ.2.49 లక్షలు
కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామి వారిని శనివారం అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించి, ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు చేశారు. దేవస్థానం చైర్మన్ దారపురెడ్డి సురేష్‌బాబు ఆధ్వర్యంలో భక్తుల పూజలకు ఏర్పాట్లు చేశారు. భక్తుల ప్రత్యక్ష పూజలు, తైలాభిషేకాల టిక్కెట్ల ద్వారా దేవస్థానానికి రూ.1,28,670, పరోక్ష పూజలు, మనియార్డర్లు ద్వారా రూ.86,600, అన్నప్రసాదం విరాళాలు రూపంలో రూ.33,954 మొత్తం రూ.2,49,224 ఆదాయం వచ్చినట్టు ఈఓ సురేష్‌బాబు తెలిపారు.


