ప్రజాస్వామిక శక్తులను బలోపేతం చేయాలి
● రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవాలి
● సీపీఐ నేత మధు
● ఘనంగా ఆ పార్టీ శతజయంతి
ఉత్సవాల ముగింపు సభ
సామర్లకోట: రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుతూ, లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలను, శక్తులను బలోపేతం చేయాల్సిన అవసరముందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు అన్నారు. సీపీఐ శత జయంతి ఉత్సవాల జిల్లా స్థాయి ముగింపు సభ శుక్రవారం సామర్లకోటలో జరిగింది. ఈ సందర్భంగా స్థానిక మెహర్ కాంప్లెక్స్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా లారీ స్టాండ్ వద్ద ఉన్న సీపీఐ కార్యాలయం వరకూ ప్రజా ప్రదర్శన నిర్వహించారు. అక్కడ సీపీఐ పతాకాన్ని పార్టీ సీనియర్ నాయకుడు చెరుకూరి సుబ్బారావు మాస్టారు ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయాన్ని మధు ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, ప్రస్తుతం దేశం సంక్షోభంలో ఉందని, క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాకర్టీ ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు. కేంద్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న మతతత్వ శక్తులు అంబేడ్కర్ వంటి మహనీయులు అందించిన రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు.. రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన లౌకిక, ప్రజాస్వామ్య, సంక్షేమ దేశాన్ని మత రాజ్యంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. దీనిలో భాగంగానే దేశాన్ని, దేశ చరిత్రను మార్చేందుకు రాజ్యాంగం నుంచి సెక్యులరిజం పదాన్ని తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. లౌకిక, ప్రజాస్వామ్య, ఫెడరల్ వ్యవస్థలు మతతత్వ శక్తుల దాడికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయి ప్రజల జీవితాలు దుర్భరంగా మారిపోయాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత లౌకిక, ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులపై ఉందని మధు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చిన తరువాత ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఏర్పడిందన్నారు. కమ్యూనిస్టుల లక్ష్యమైన కుల, మత రహిత సోషలిస్టు సమాజ నిర్మాణానికి నిరంతరం పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. సీపీఐ వందేళ్ల పోరాట వారసత్వాన్ని యువత ముందుకు తీసుకు వెళ్లాలని కోరారు. సీపీఐ పట్టణ కార్యదర్శి పెదిరెడ్ల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పప్పు ఆదినారాయణ, సీనియర్ నాయకులు చింతపల్లి సుబ్బారావు, కట్ట సత్యనారాయణ, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వై.బాబు, ఏఐఎస్‌ఎఫ్ నేత నాని స్టాలిన్, మున్సిపల్ యూనియన్ నాయకులు నందకిషోర, బొత్స శ్రీనివాసు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ కార్యకర్తలను సత్కరించారు.


