రూ.150 నాణెం సేకరణ
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వందేమాతర గీతం రూపుదిద్దుకొని 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముంబై టంకసాల ద్వారా రూ.150 ప్రత్యేక స్మారక నాణెం విడుదల చేసింది. దీనిని కాకినాడకు చెందిన ప్రముఖ నాణేల సేకర్త మార్ని జానకిరామ చౌదరి సేకరించారు. 32 గ్రాముల బరువైన ఈ నాణేన్ని రాగి, నికెల్, జింక్ మిశ్రమ లోహాలతో తయారు చేశారు. దీనికి ఒకవైపు రూ.150 ముఖవిలువను, మరోవైపు తుపాకీ ఎక్కుపెట్టి బ్రిటిష్ సైనికుల అరాచకాలను నిరసిస్తూ భారతీయులు ఏకతాటిపై నిలిచి ‘వందేమాతరం’ అంటూ నినదిస్తున్న చారిత్రక దృశ్యాన్ని ముద్రించారు. భారత స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో పాటు సాంస్కృతిక వారసత్వాన్ని, దేశభక్తిని చాటే ఇలాంటి అరుదైన నాణెం సేకరించటం గర్వంగా ఉందని జానకిరామ చౌదరి శుక్రవారం విలేకర్లకు తెలిపారు.
చంద్రబాబుది ట్రబుల్
ఇంజిన్ సర్కార్
కాకినాడ రూరల్: చంద్రబాబుది డబుల్ ఇంజిన్ సర్కారు కాదని, ట్రబుల్ ఇంజిన్ సర్కార్ అని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి విమర్శించారు. శుక్రవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర సంపదను కొందరికి దోచి పెట్టడానికే చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తోందని దుయ్యబట్టారు. గడచిన 8 నెలల్లో రాష్ట్ర ఆర్థిక లోటు 163 శాతానికి చేరిందంటూ కాగ్ నివేదిక ఇవ్వడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ శాతం కొంత మంది కాంట్రాక్టర్లకు దోచి పెట్టడమే ప్రభుత్వ విధానంలా మారిందని దుయ్యబట్టారు. చేస్తున్న అప్పులు ఎక్కడికి పోతున్నాయో కూడా చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసేందుకు కంకణం కట్టుకోవడం దారుణమన్నారు. ఆయుష్ ఆస్పత్రిలో కీలకమైన అధ్యాయం మొదలైందని చెబుతున్న ప్రభుత్వం.. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ సూచనల మేరకు ముఖ్యమంత్రి, మంత్రులు అక్కడ చికిత్స చేయించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరుగుతోందంటూ కాగ్ పదేపదే చెబుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికై నా కుప్పలు తెప్పలుగా అప్పులు చేయడం మానుకుని, ఆదాయం పెంపుపై దృష్టి సారించాలని నాగమణి హితవు పలికారు.
‘కేవల మర్త్యుడె ధర్మసుతుడు?’
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్) ధర్మరాజును కేవలం మానవమాత్రుడేనని అనుకోరాదని ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో కొనసాగిస్తున్న వ్యాస భారత ప్రవచనంలో భాగంగా కీచక వధ వృత్తాంతాన్ని శుక్రవారం ఆయన వివరించారు. ‘‘నిండు సభలో కామరోగ పీడితుడైన కీచకుడు.. ద్రౌపదిని కాలితో తన్ని అవమానిస్తాడు. ఆ రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో భీముని వద్దకు వెళ్లి ద్రౌపది తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. ‘యుధిష్టిరుని భర్తగా పొందిన సీ్త్ర.. శోకం లేనిదెలా అవుతుంది? – అశోచ్యత్వం కుతస్తస్యాః యస్యా భర్తా యుధిష్ఠిరః’ అని తీవ్ర దుఃఖంతో అంటుంది. భీముడు సాంత్వనవచనాలతో ఆమెను ఓదార్చి, కీచకుడిని నర్తనశాలకు రాత్రి వేళ రావాల్సిందిగా ఆహ్వానించాలని, వాడిని అక్కడే గుట్టుగా మట్టు పెడతానని చెబుతాడు. ద్రౌపది తన తొందరపాటును నిందించుకుంటూ, ఆవేశంలో, దుఃఖాన్ని తట్టుకోలేక, ధర్మరాజు గురించి పరుషమైన పదాలు పలికానని, ఆ మహానుభావుని దివ్యత్వం తనకు తెలుసునని అంటుంది. ‘ఎవని చరిత్రము ఎల్ల లోకాలకు గురుస్థానంలో నిలచి పూజనీయమవుతుందో, ఎవని కడగంటి చూపు మానిత సంపదలు కలగచేస్తుందో, అట్టి మహానుభావుడు ధర్మరాజును కేవలం మానవమాత్రుడని అనుకోరాదు. కేవల మర్త్యుడె ధర్మసుతుడు?’ అని తన అంతరంగాన్ని వెల్లడిస్తుంది. చక్కగా అలంకరించుకుని నర్తనశాలకు వచ్చిన కీచకుడిని భీముడు గుట్టుగా మట్టు పెడతాడు. అతడి పార్థివ శరీరంతో పాటు ద్రౌపదిని దహనం చేయాలనుకున్న ఉపకీచకులు 105 మందిని భీముడు వధిస్తాడు. హస్తినలో వేగుల ద్వారా కీచకుని మరణ వార్త విన్న దుర్యోధనుడు ఈ పని చేసింది భీముడేనని, కీచకుడు మనసు పడ్డ సైరంధ్రి ద్రౌపది అనే నిర్ణయానికి వస్తాడు. ధర్మరాజు ఉన్న రాజ్యం సుఖశాంతులతో ఉంటుందని భీష్ముడు చెబుతాడు’’ అంటూ సామవేదం వివరించారు. అప్పటికే పాండవుల అజ్ఞాతవాస గడువు పూర్తయిందని అన్నారు.
రూ.150 నాణెం సేకరణ
రూ.150 నాణెం సేకరణ
రూ.150 నాణెం సేకరణ
రూ.150 నాణెం సేకరణ


