30న రత్నగిరిపై ఉత్తర ద్వార దర్శనం
అన్నవరం: ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిలో ఉత్తర ద్వార దర్శనం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు అన్నవరం దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు శుక్రవారం తెలిపారు. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకు సత్యదేవుని ఆలయంలో ఉత్తర ద్వారం వద్ద శ్రీమహావిష్డువు, శ్రీమహాలక్ష్మి అలంకరణలో సత్యదేవుడు, అమ్మవార్లను కొలువుదీరుస్తారు. పండితులు వివిధ పూజలు నిర్వహిస్తారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులను ఉత్తర ద్వార దర్శనానికి అనుమతిస్తారు. భక్తుల రద్దీని అనుసరించి సాయంత్రం 5 గంటల వరకూ ఈ దర్శనం కొనసాగుతుంది. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అమ్మవారిని వెండి రథంపై ఊరేగిస్తారు. రాత్రి 7 గంటల నుంచి కొండ దిగువన గరుడ వాహనంపై స్వామి, అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహిస్తామని ఈఓ తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేవస్థానంలో చేస్తున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం ఏర్పాటు చేసే క్యూ లైన్లపై ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. స్వామివారి ప్రసాద విభాగాన్ని పరిశీలించారు. ప్రసాదం తయారీలో ఉపయోగిస్తున్న నెయ్యి, పంచదార, ఇతర దినుసులను పరిశీలించారు. అక్కడి సిబ్బంది సమస్యలపై ఆరా తీశారు. భక్తులు మెచ్చే విధంగా ప్రసాదం తయారు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ, ఏఈఓలు భాస్కర్, ఎలక్ట్రికల్ డీఈ సత్యనారాయణ, ప్రసాదం విభాగం సూపరింటెండెంట్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తొలి తిరుపతిలో..
పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండలంలో తొలి తిరుపతి గ్రామంలోని శృంగార వల్లభ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ నెల 30న ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. స్వామివారికి 29న ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తామన్నారు. మంగళవారం తెల్లవారుజామున 3.30 నుంచి 4.30 గంటల వరకూ మేలుకొలుపు హారతి, సుప్రభాత సేవ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం 4.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకూ భక్తులకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తామని చెప్పారు. భక్తులకు ఉచిత దర్శనం ఏర్పాట్లు చేస్తున్నామని ఈఓ శ్రీనివాసరావు, చైర్‌పర్సన్ మొయిల సంధ్య తెలిపారు. భక్తులకు ప్రసాద వితరణ ఉంటుందన్నారు.
పోస్టాఫీసుల పనివేళల పెంపు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ డివిజన్‌లోని పోస్టాఫీసుల పని వేళలను పొడిగించినట్లు కాకినాడ పోస్టల్ సూపరింటెండెంట్ కె.కృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీఎస్‌పీ క్యాంపస్ ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ.. గాంధీ నగర్, జగన్నాయక్‌పూర్, పెద్దాపురం పోస్టాఫీసులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ.. జేఎన్‌టీయూకే తపాలా కార్యాలయం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకూ.. జగ్గంపేట పోస్టాఫీసు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకూ పని చేస్తాయని వివరించారు.


