బస్సులు పెంచకుండా ఉచిత ప్రయాణమా!
● సీ్త్రశక్తి పథకంతో తీవ్ర ఇబ్బందులు
● ఆర్టీసీ సిబ్బందికి పెరిగిన పనిభారం
గోకవరం: బస్సులను పెంచకుండా సీ్త్రశక్తి పథకం అమలు చేయడంతో ప్రయాణికులకు, ఆర్టీసీ సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు అన్నారు. ఈ మేరకు శనివారం గోకవరం ఆర్టీసీ డిపో ఎదుట రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గేటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏఎస్ నారాయణ, డిపో అధ్యక్షుడు జీఎస్ రావు, ప్రధాన కార్యదర్శి కేఎస్‌పీ రావు మాట్లాడుతూ ఉచిత బస్సు పథకంతో సిబ్బందిపై పని భారం పెరిగిపోయిందని, కండక్టర్లకు పొరపాట్లు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటి వల్ల వారి ఉద్యోగ భద్రత ముప్పు వాటిల్లుతుందన్నారు. బస్సుల్లో రెండు రకాల టిక్కెట్లు ఇచ్చే విధానాన్ని తీసి వేసి, డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే టిక్కెట్లు ఇచ్చేలా నిబంధన మార్చాలని డిమాండ్ చేశారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం బస్సులకు డోర్లు ఏర్పాటు చేసి బస్సుల్లో 70 మంది ప్రయాణికులకు మాత్రమే అనుమతించేలా చూడాలన్నారు. తక్షణమే బస్సుల సంఖ్యను పెంచాలని, బస్సులకు హైడ్రాలిక్ డోర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎంఎన్‌వీఎస్ నారాయణ, జిల్లా కార్యదర్శి ఎన్‌ఎన్ రావు, జీఎస్‌రావు, సెక్రటరీ రమణ, ఎంఎం కృష్ణ, సూర్యచంద్రరావు, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.


