పదోన్నతుల్లో సీనియారిటీకే ప్రాధాన్యమివ్వాలి
● విద్యుత్ ఓసీ ఉద్యోగుల డిమాండ్
● కాకినాడలో సంఘ వార్షికోత్సవం
కాకినాడ రూరల్: పదోన్నతుల్లో సీనియారిటీకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. కాకినాడ ఎన్‌ఎఫ్‌సీఎల్ రోడ్డలోని జి.కన్వెన్షన్ హాల్లో శనివారం రాష్ట్ర స్థాయిలో సంఘ 17వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు దూళిపాల వెంకట రంగారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో 2026 సంవత్సర కేలండర్, డైరీలను ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వరుపుల సత్యప్రభ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి హాజరయ్యారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓసీల ప్రయోజనాల కోసం పోరాటానికి విద్యుత్ సంస్థలో విద్యుత్ ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని ప్రారంభించామన్నారు. ముఖ్యంగా ఓసీలకు ప్రతిభ ఉన్నా ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల వలన అన్యాయం జరుగుతోందన్నారు. పదోన్నతుల్లో రిజర్వేషన్ల కంటే సీనియారిటీకే ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఉద్యోగుల పీఆర్‌సీ, న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫారం నేషనల్ ప్రెసిడెంట్ ఎం.నాగరాజు, ఓసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్ రెడ్డి, సౌత్‌జోన్ ఏఐఈఎఫ్ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నజీర్ డల్, ఈపీడీసీఎల్ కంపెనీ ప్రెసిడెంట్ అప్పలరాజు, కంపెనీ సెక్రటరీ త్వరగా రామకృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ప్రాంతీయ అధ్యక్షుడు కేవీవీ రమణ, కాకినాడ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు డి.సురేష్‌బాబు, జ్యోతుల వీరబాబు, బొజ్జా వాసు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


