ఎదురీతే.. | - | Sakshi
Sakshi News home page

ఎదురీతే..

Dec 28 2025 7:32 AM | Updated on Dec 28 2025 7:32 AM

ఎదురీ

ఎదురీతే..

కరప మండలం జెడ్‌.భావారంలో మోంఽథా తుపాన్‌కు నీట మునిగిన పంట (ఫైల్‌)

పాత పెద్దాపురంలో నీటిలో కుళ్లిపోయిన పంటను చూపుతున్న రైతులు (ఫైల్‌)

ఈ ఏడాదంతా రైతులకు కష్టాలే

కలసిరాని కాలం

చంద్రబాబు సర్కార్‌ నిర్లక్ష్యం

పెరిగిన పెట్టుబడులు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: పట్టెడన్నం పెట్టే రైతన్న ఈ ఏడాది కష్టాల కడలిలో ఎదురీదాడు. ఆరుగాలం పడిన రెక్కల కష్టం ప్రకృతి కన్నెర్రకు తోడు చంద్రబాబు సర్కార్‌ నిర్వాకంతో నీటి పాలైంది. రబీ సీజన్‌ ఒక రకంగా నష్టపోతే ఖరీఫ్‌ సీజన్‌లో ముందుచూపులేని ప్రణాళిక సాగులో జాప్యానికి కారణమై రైతులు గుండెలు బాదుకుంటున్నారు. అకాల వర్షాలు రైతులను నిండా ముంచేశాయి. చేతికొచ్చిన ధాన్యాన్ని కనీస మద్ధతు ధర దక్కిందా అంటే అదీ లేదు. ధాన్యం సేకరణ లక్ష్యాన్ని ప్రభుత్వం కుదించడం దళారీ వ్యవస్థకు గేట్లు తెరిచినట్‌లైంది. తేమ శాతం అనే కుంటి సాకులతో రైతులకు మద్దతు లేకుండా పోయింది. పోనీ రబీ సీజన్‌లో అయినా సంతోషంగా సాగు జరుగుతుందా అంటే అదీ కొరవడింది. మొత్తంగా చూస్తే ఈ ఏడాది (2025) రైతులకు కలిసి రాలేదు.

ఎరువుల బ్లాక్‌

2025 ప్రారంభంలో రబీని గంపెడాశతో స్వాగతించిన రైతులకు ప్రారంభంలోనే చంద్రబాబు ప్రభుత్వంలో కొందరు పెద్దలు ఎరువులను బ్లాక్‌ చేసి చుక్కలు చూపించారు. దీంతో ప్రతి ఎకరాకు రూ.500 తక్కువ కాకుండా అదనపు భారం పడింది. పెట్టుబడి ఎక్కువై రైతు కుదేలయ్యాడు. జిల్లాలో 2.10 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 5 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చింది. సవాలక్ష ప్రతి బంధకాల మధ్య సాగు చేసిన రైతుల నుంచి కనీస మద్ధతు ధరకు ప్రభుత్వం పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయలేదు. జిల్లాలో ఎంఎస్‌పీకి 3 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, కేవలం 2.60 లక్షల మెట్రిక్‌ టన్నులకే సరి పెట్టేసి రైతుల నెత్తిన పిడుగు పడేసింది. మాసూళ్లు సమయంలో అకాల వర్షాలకు తోడు గోనె సంచుల కొరత కూడా వేధించింది. తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకుతో ప్రతి బస్తా ధాన్యం కొనుగోలుపై సుమారు రూ.400ను కమీషన్‌ ఏజెంట్లు, దళారులు కోత పెట్టడంతో రైతులు నష్టాలపాలయ్యారు. 80 వేల మంది రైతులు వద్ద ధాన్యం కొనుగోలు చేసి సక్రమంగా సకాలంలో వారి ఖాతాలో నగదు జమ చేసిన దాఖలాలు లేవు.

మోంథా తుపానుతో భారీ నష్టం

ఖరీఫ్‌లో సాగునీటి ఎద్దడి, ప్రకృతి విపత్తులకు తోడు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాభావ పరిస్థితులతో సాగును ఆలస్యం కాగా, జిల్లాలో 2.10 లక్షల ఎకరాల్లో సాగుకు చేశారు. పంట పాలుపోసుకునే, గింజ గట్టిపడే దశల్లో మోంథా తుపాను తీవ్ర నష్టం కలిగింది. స్వర్ణ, సంపద స్వర్ణ సాగు చేసిన పొలాల్లో పంట నేలకొరిగి రైతులు కకావికలం అయ్యారు. ఎంటీయూ 1318, పీఎల్‌ఏ 1100 తదితర రకాల్లో తాలు గింజలు పెరిగి దిగుబడులు తగ్గిపోయాయి.

నేలనంటిన వరి

సామర్లకోట, పిఠాపురం, కొత్తపల్లి, కాకినాడ రూరల్‌ తదితర మండలాల్లో పంట పొలాలు నేలనంటాయి. మోంథా తుపానుతో జిల్లాలో సుమారు 70 వేల ఎకరాలలో వరి ముంపునకు గురైందని అధికారులు అంచనాలు రూపొందించారు. తీరా చివరకు నష్టం అంచనాలు కాస్తా బక్కచిక్కిపోయి 40 వేల ఎకరాలు మాత్రమే పంట నష్టం సంభవించినట్టు రికార్డులకెక్కాయి. దిగుబడి పరంగానూ రైతులకు ఖరీఫ్‌ కలిసి రాలేదు. ఎకరాకు సుమారు 35 బస్తాలు చొప్పున వస్తుందన్న అంచనాలు తల్లకిందులై కేవలం 25 బస్తాలు మాత్రమే వచ్చింది. తేమ శాతం ఎక్కువగా ఉందనే కుంటి సాకులతో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది.

దళారుల దందా

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తివేసి.. రైతుల నెత్తిన ప్రీమియం భారం మోపింది. అలాగే జిల్లాలో 60 వేల మంది పైచిలుకు కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కూడా దూరం చేసింది. దాని కింద రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామని చెప్పి, మొదటి ఏడాది ఎగనామం పెట్టారు. ధాన్యం కొనుగోలులో దళారులకు గేట్లు తెరిచారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉన్న ఆర్‌బీకే వ్యవస్థ నిర్వీర్యం చేశారు. అయితే చంద్రబాబు సర్కారు మాత్రం ప్రచార యావతో ‘రైతన్నా.. మీకోసం’ అంటూ గ్రామాల్లో సభలు నిర్వహించి హడావుడి చేసింది.

రైతులకు అండగా జగన్‌ ప్రభుత్వం

జగన్‌ సర్కార్‌ సాగుకు ముందే పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలకు అండగా నిలిచింది. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా ఇచ్చే రూ.6 వేలకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.7500 కలిపి మొత్తం రూ.13,500 చొప్పున రైతు ఖాతాలో జమ చేస్తూ వచ్చింది. జిల్లాలో రెండు లక్షల మంది రైతులకు ఏటా రూ.200 కోట్లకు పైగా రైతు భరోసా ద్వారా అందించింది. దీనితో పాటు వైఎస్సార్‌ సున్నా వడ్డీ, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, ఇన్‌పుడ్‌ సబ్సిడీ ఇలా పలు పథకాల ద్వారా రైతులకు ఆర్థికంగా అండగా నిలిచింది.

ఉచిత పంటల బీమాకు మంగళం

రైతులపై ప్రీమియం భారం లేకుండా 2019 ఖరీఫ్‌ నుంచి వైఎస్సార్‌ ప్రభుత్వం ఉచిత పంటల బీమాను తీసుకువచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాన్ని ఎత్తివేసి ప్రీమియం భారాన్ని రైతులపై మోపింది. జిల్లాలో 2,15,068 ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు చేయగా రైతులు ఎకరాకు రూ.210 చొప్పున 72,766 ఎకరాలకు మాత్రమే ప్రీమియం చెల్లించారు. మిగిలిన 1,42,302 ఎకరాలు క్రాఫ్‌ ఇన్స్యూరెన్స్‌కు దూరంగా ఉండటం గమనార్హం.

ఆర్‌బీకే వ్యవస్థ నిర్వీర్యం

విత్తు నుంచి పంట ఉత్పత్తుల విక్రయం వరకు సాగులో రైతుకు అన్ని విధాలా అండగా ఉండేందుకు అప్పటి జగన్‌ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం వాటి పేర్లను రైతు సేవా కేంద్రాలుగా మార్చిందే తప్ప.. అన్నదాతలకు ఒక్క ప్రయోజనం కల్పించలేదు. ప్రస్తుతం కొన్ని ఆర్‌బీకే భవనాలను ఇతర కార్యాలయాలకు వినియోగిస్తుండగా, మరికొన్ని తాళం వేసి కనిపిస్తున్నాయి. ఏడాది పొడవునా ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతూనే 2025ను అతి భారంగా వీడుతున్నారు.

యూరియా ఇవ్వలేని దుస్థితి

చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయం కుంటుపడింది. రైతును ఆదుకోవడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారు. కనీసం యూరియా ఇవ్వలేని దయనీయ స్థితిలో ఈ ప్రభుత్వం నడుస్తోంది. రైతులందరికీ ఈ – క్రాప్‌ చేయలేదు. కౌలు రైతులకు కౌలు కార్డులు లేవు. పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. గత జగన్‌ ప్రభుత్వంలో విత్తనాలు, ఎరువులు, ఈ– క్రాప్‌ చక్కగా జరిగింది. ధాన్యం కొనుగోలులో హమాలీ, రవాణా చార్జీలను చెల్లించారు. గిట్టుబాటుఽ ధర కంటే రైతులకు ఎక్కువ లభించేలా చర్యలు తీసుకున్నారు.

– లంక ప్రసాద్‌,

వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు

ఎదురీతే..1
1/3

ఎదురీతే..

ఎదురీతే..2
2/3

ఎదురీతే..

ఎదురీతే..3
3/3

ఎదురీతే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement