
నేడు పీజీఆర్‌ఎస్
కాకినాడ సిటీ: జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ హాలులో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. దీనికి జిల్లా అధికారులందరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. దీనికి రాలేని వారు తమ అర్జీలను ‘మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్’ వెబ్‌సైట్‌లో కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అర్జీల నమోదు స్థితి తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు నేరుగా కాల్ చేయవచ్చన్నారు.
మరిడమ్మ సన్నిధికి
పోటెత్తిన భక్తులు
పెద్దాపురం: మరిడమ్మ మహోత్సవాల్లో భాగంగా ఆఖరి ఆదివారం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చి, క్యూలైన్లలో బారులు తీరారు. సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా ఆలయ ట్రస్టీ చింతపల్లి శ్రీహర్ష, అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి ఆధ్వర్యాన ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. పెద్దాపురం బ్రాహ్మణ సేవా సంఘం, సామర్లకోట లయన్స్ క్లబ్ ఆధ్వర్యాన భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. కొత్తపేట, పాశిలి వీధి సంబరాలు ఘనంగా నిర్వహించారు.