
ఏలేరుకు గోదావరి జలాలు
ఏలేశ్వరం: తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి పైపులైన్ల ద్వారా గోదావరి జలాలను ఏలేరు జలాశయంలోకి విడుదల చేస్తున్నారు. మంగళవారం నాటికి 175 క్యూసెక్కుల గోదావరి జలాలు వదిలారు. అలాగే, ఏలేరు పరీవాహక ప్రాంతం నుంచి 1,910 క్యూసెక్కుల జలాలు రిజర్వాయర్‌లోకి వచ్చి చేరాయి. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా మంగళవారం 77.25 మీటర్లుగా నమోదైంది. పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 10.46 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు 1,300, విశాఖ నగరానికి 200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.
నేడు సత్యదేవుని
హుండీల లెక్కింపు
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో హుండీలను బుధవారం తెరచి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి స్వామివారి నిత్య కల్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. సిబ్బంది అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఈఓ ఆదేశించారు. గత ఆషాఢ మాసంలో శుభకార్యాలు జరగనప్పటికీ సత్యదేవుని ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో హుండీల్లో కానుకలు దండిగానే పడ్డాయి. స్వామివారి ఆలయం వద్ద ప్రధాన హుండీ నిండిపోవడంతో సీల్ వేశారు. ఈ నెల కూడా సుమారు రూ.కోటి ఆదాయం రాగలదని అంచనా వేస్తున్నారు.
కూటమి ప్రభుత్వంపై
సుప్రీంకోర్టులో పిల్ వేస్తాం
రాజమహేంద్రవరం సిటీ: దొంగ హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చి, ఆ హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్) వేయనున్నట్లు అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ చెప్పారు. రాజమహేంద్రవరంలోని తన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వం ఒక్క పథకం కూడా అమలు చేయలేదన్నారు. మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తే రాష్ట్రం దివాళా తీస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు అనడం దారుణమన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆ పథకాన్ని అమలు చేసి చూపారన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని అమలు చేయకుండా క్యాబినెట్‌లో ప్రకటించడం దారుణమన్నారు. తల్లికి వందనం అమలు జరగడం లేదన్నారు. జగన్ రూ.13 వేలు ఇస్తే విమర్శించారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా రూ.13 వేలే ఇస్తోందని చెప్పారు. సంపద సృష్టిస్తామని చెప్పి, కార్పొరేట్ కంపెనీలకు భూములను కారుచౌకగా 99 పైసలకే కట్టబెడుతున్నారని, ఇందు లో క్విడ్ ప్రో కో జరుగుతోందని హర్షకుమార్ ఆరోపించారు. ఎవరికో ఒకరికి భూములు కట్టబెట్టడానికే మంత్రి మండలి సమావేశం జరుగుతోందని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం కక్షపూరిత ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు. ప్రతి వారినీ జైలులో పెడుతున్నారన్నారు. బిహార్‌లో జరిగిన ఎన్నికల అక్రమాలపై లోక్‌సభలో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. బిహార్ ఎన్నికల్లో 8 లక్షల బోగస్ ఓట్లు వచ్చాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అన్ని ఎన్నికల్లోనూ బోగస్ ఓట్లు సృష్టించి గెలుస్తున్నారని ఆరోపించారు. పోలైన ఓట్ల కంటే లెక్క పెట్టిన ఓట్లే ఎక్కువగా ఉంటున్నాయన్నారు.
‘నన్నయ’కు వుడ్ చిప్పర్
రాజానగరం: యూనివర్సిటీ ప్రాంగణాన్ని సుందరీకరించడంలో భాగంగా చెట్ల కొమ్మలు, పొదలు, వ్యర్థాలను చిప్స్‌గా మార్చే మైజో వీమా వుడ్ చిప్పర్ యంత్రాన్ని ఆదికవి నన్నయ యూనివర్సిటీ కొనుగోలు చేసింది. దీనిని వైస్ చాన్సలర్ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ మంగళవారం ప్రారంభించారు. ఈ యంత్ర సాయంతో తయారయ్యే వుడ్ చిప్స్‌ను మొక్కలకు కంపోస్టు ఎరువుగా వాడవచ్చని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. వ్యర్థాలను కాల్చివేయడం వలన పర్యావరణం కలుషితమవుతుందని, ఆవిధంగా కాకుండా ఈ యంత్రం చక్కని ప్రత్యామ్నాయమని అన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డీన్ డాక్టర్ బి.జగన్‌మోహన్‌రెడ్డి, కె.దేవలాల్, కె.లక్ష్మీపతి, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

ఏలేరుకు గోదావరి జలాలు