
‘మాచవరం’ ఘటనపై కదిలిన యంత్రాంగం
రాయవరం: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకునేందుకు, అవసరమైన పక్షంలో మూసివేసేందుకు వెనుకాడబోమని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా హెచ్చరించారు. మాచవరంలోని మార్గదర్శి పాఠశాలలో బాలికను ఆ స్కూల్ కరస్పాండెంట్ గర్భవతిని చేసిన ఘటనపై మంగళవారం ఆయన విచారణ చేపట్టారు. రాయవరం ఎంఈవో–1 పి.రామలక్ష్మణమూర్తి ద్వారా ప్రాథమిక సమాచారం తెలుసుకున్న ఆయన హుటాహుటిన మాచవరం గ్రామానికి చేరుకున్నారు. ఆ స్కూల్లో ఎటువంటి అనుమతులు లేకుండా 8, 9, 10 తరగతులు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం ఒకటి నుంచి 7వ తరగతి వరకు 49 మంది విద్యార్థులు చదువుతున్నారని పాఠశాల రికార్డుల ద్వారా తెలుసుకున్నారు. పాఠశాలలో కనీస సౌకర్యాలు ముఖ్యంగా మరుగుదొడ్లకు తలుపులు కూడా లేకపోవడంపై డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం పాఠశాలలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. అలాగే బాలిక కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం పాఠశాల గుర్తింపును రద్దు చేసే విషయాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. విచారణ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు ఇటువంటి పాఠశాలలను మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని డీఈవోకు విన్నవించారు. ఆయన వెంట ఎంపీడీవో ఎన్.కీర్తి స్పందన, ఎంఈవోలు పి.రామలక్ష్మణమూర్తి, వై.సూర్యనారాయణ, సమగ్ర శిక్షా జీసీడీవో డాక్టర్ ఎంఏకే భీమారావు, ఏఎల్‌ఎస్ కో ఆర్డినేటర్ డి.రమేష్‌బాబు తదితరులు ఉన్నారు.
ట్రైనీ డీఎస్పీ విచారణ
మాచవరంలో బాలిక ఘటనపై ట్రైనీ డీఎస్పీ ప్రదీప్తి, మండపేట సీఐ పి.దొరరాజుతో కలిసి విచారణ చేపట్టారు. ఆ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో పాఠశాలలో నేర స్థలాన్ని పరిశీలించారు. మాచవరంలో ప్రైవేట్ పాఠశాలను కరస్పాండెంట్ ఆకుమర్తి షాజీ జయరాజ్ కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నాడు. పాఠశాలలో చదువుకోవడానికి వచ్చిన బాలికను లోబర్చుకుని, ఆమెను భయపెట్టి గర్భవతిని చేసినట్లుగా ప్రాథమిక విచారణలో అధికారులు గుర్తించారు. గతంలో కూడా పాఠశాలలో ఇలాంటి కొన్ని ఘటనలు జరగ్గా, పరువు పోతుందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మిన్నకుండినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. అయితే తమ కూతురికి జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదనేఉద్దేశంతోబాలిక తండ్రి ఆ పాఠశాల కర స్పాండెంట్ షాజీ జయరాజుపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రాయవరం ఎస్సై డి.సురేష్ బాబు సోమవారం రాత్రి జరిగిన ఘటనపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
డీఈవో సలీం బాషా విచారణ
బాలిక తల్లిదండ్రులతో మాట్లాడిన వైనం
ఘటనా స్థలాన్ని పరిశీలించిన
ట్రైనీ డీఎస్పీ, సీఐ

‘మాచవరం’ ఘటనపై కదిలిన యంత్రాంగం