
నేతల కోతల యుద్ధం
జగన్ సర్కార్‌లోనే..
వాస్తవానికి ఉప్పాడ కొత నివారణ, రక్షణ ప్రతిపాదనలు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూపొందగా టీడీపీ, జనసేల నేతలు ఎవరి గొప్పలు వారు చెప్పుకుంటుంటే జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఉప్పాడ సముద్ర కోత నివారణకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేయాల్సినంతా చేసింది. సమస్య తీవ్రతను నాటి కాకినాడ ఎంపీ వంగా గీత ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కేంద్రానికి నివేదించారు. రూ.300 కోట్ల పై చిలుకు బడ్జెట్ అవసరాన్ని తెలియజేస్తూ డీపీఆర్ రూపొందించి గీత స్వయంగా కేంద్రానికి నివేదించారు. ప్రాజెక్టు రిపోర్టుపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. ఇక నిధులు విడుదల మాత్రమే మిగిలి ఉందనే తరుణంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో ప్రాజెక్టు నిలిచిపోయింది. ఈ విషయాలన్నీ పిఠాపురం ప్రజలకు తెలియనివి కావు. వర్మ, మర్రెడ్డి వర్గాలు వాస్తవాలు మరుగునపెట్టి జనసేన, టీడీపీ నేతలు రాజకీయంగా ఆధిపత్యం కోసం గొప్పలకు పోతున్న తీరుపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి కాకినాడ: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి నేతల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరుకుంది. ఇరు పార్టీల నేతలు నియోజకవర్గంలో ప్రతి అంశంలో తమది గొప్ప అంటే తమది గొప్ప అని జబ్బలు చరుచుకుంటున్నారు. ఎప్పుడైతే పిఠాపురం సీటును జనసేనకు కేటాయించారో అప్పటి నుంచే ఈ రచ్చ మొదలైంది. దీనికి కొనసాగింపుగా ఎమ్మెల్సీ నాగబాబు రాజేసిన అగ్గి రావణ కాష్టంలా కాలుతూనే ఉంది. పొత్తులో భాగంగా సీటు త్యాగం చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ వర్మను ఎన్నికలయ్యే వరకు పవన్ కల్యాణ్ ఆకాశానికెత్తేశారు. పవన్ ఉప ముఖ్యమంత్రి కాగానే ‘కూరలో కరివేపాకులా... పక్కన పెట్టేశారని టీడీపీలోని వర్మ వర్గీయులు బాహాటంగానే ఆక్షేపిస్తున్నారు. దీనికితోడు వర్మపై సైటెర్‌లతో పవన్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు టీడీపీ, జనసేన నేతల మధ్య వర్గపోరుకు మరింత అగ్గి రాజేశారని చెప్పొచ్చు. సోదర ద్వయం చంద్రబాబుతో కుమ్మకై ్క వర్మ ఎమ్మెల్సీ ఆశలపై కూడా నీళ్లు చల్లేశారు. ఈ నేపథ్యంలో సొంత సామాజిక వర్గానికి చెందిన మర్రెడ్డి శ్రీనివాస్‌ను పవన్ కల్యాణ్ పిఠాపురం ఇన్‌చార్జిగా నియమించారు.
మాటల తూటాలు
అనంతర పరిణామాల్లో పిఠాపురంలో టీడీపీలో వర్గం ఒకవైపు, జనసేన నేతలు మరో వైపు హోరాహోరీగా తలపడుతున్నారు. పిఠాపురంలో ఏ చిన్న అంశాన్ని కూడా టీడీపీ, జనసేన వర్గాలు విడిచిపెట్టడం లేదు. ప్రతి విషయంలోనూ ఆధిపత్యం కోసం పాకులాడుతూనే ఉన్నారు. పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక నియోజకవర్గ అభివృద్ధికి రూ.వందల కోట్లు మంజూరు చేశారని నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాస్ ఇటీవల గొప్పగా ప్రకటించుకున్నారు. ఇందులో ఉప్పాడ సముద్ర కోత నివారణకు ఉద్దేశించిన ప్రాజెక్టు కూడా ఉంది. ఇటీవల సముద్ర ఉధృతి పెరిగి రాకాసి కెరటాలతో ఉప్పాడ తీరంలో మత్స్యకారుల ఇళ్లకు నష్టం సంభవించింది. బాధిత కుటుంబాల పరామర్శ, సముద్ర కోత పరిశీలన పేరుతో అటు వర్మ, ఇటు మర్రెడ్డి మాటల యుద్ధానికి తెర తీశారు.
కూటమిలో గొప్పల తిప్పలు
ఉప్పాడ సముద్ర కోత నివారణ
ప్రతిపాదనల్లోనూ ఆధిపత్య పోరు
వర్మ వెర్సెస్ మర్రెడ్డి
ఇదేం తీరు అని జనం విస్మయం

నేతల కోతల యుద్ధం