
స్వేచ్ఛగా మాట్లాడనివ్వరా..?
సాక్షి, రాజమహేంద్రవరం: ఎంపీ మిథున్‌రెడ్డితో ములాఖత్‌లో సైతం స్వేచ్ఛగా మాట్లాడనివ్వడం లేదు. ములాఖత్‌లో మా పక్కనే పోలీసులు ఉంటున్నారు. కనీసం ప్రశాంతంగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి ఆరోపించారు. లిక్కర్ కేసులో అక్రమ అరెస్టుకు గురై రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డితో శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు, ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు బుధవారం ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయట ద్వారకనాథ్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. న్యాయ స్థానం ఆదేశాలిచ్చినా.. ఆర్డర్ ఇచ్చినా అన్ని విషయాల్లో పోలీసులు వేలు పెట్టి చూసే పరిస్థితి కనిపిస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ నేతలు, ప్రజా ప్రతినిధులను టెర్రరిస్టులు, మావోయిస్టులను చూసినట్టు చూస్తున్నారని ఆవేదన చెందారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ప్రభుత్వానికి ఇది మంచిది కాదని హితవు పలికారు. ‘పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. చంద్రబాబు ఆయన కొడుకులా మోసాలు చేస్తే ఇంతకన్నా బాగా ఉండే వాళ్లం. మాపై కక్ష సాధించే వాళ్లను కచ్చితంగా భగవంతుడు చూస్తాడు. ఇలాంటి కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదు. చార్జ్ షీట్లో కూడా మిథున్‌రెడ్డి పేరు లేదు. అయినా అరెస్టు చేశారు. చంద్రబాబు కంటే ముందు నుంచి మా కుటుంబం ఎంతో ఉన్నతంగా ఉంది. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన మీడియా ఎన్నో కథలు చెప్పింది. మిథున్‌రెడ్డిని ఏ కారణంతో అరెస్టు చేశారో చెప్పలేకపోతున్నారు. సాధారణ వ్యక్తులు సైతం జైల్లో ప్రశాంతంగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. మేము వెళ్లినప్పుడు మాత్రం నలుగురు పోలీసులు ఉంటున్నారు. వసతులపై కోర్టు ఉత్తర్వులిచ్చినా తమకు అందలేదంటూ ఇబ్బందులు పెడుతున్నారు. అరెస్టు చేసేందుకు ఒక్క ఆధారం దొరకలేదు. ఏదో ఒక కేసు పెట్టి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు.’ అని ఆవేదన చెందారు. మాజీ ఎమ్మెల్యే ప్రసాద్‌రాజు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరిని జైల్లో పెడుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టి అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ రాష్ట్రంలో విధ్వంసకర పాలన కొనసాగుతోందన్నారు. ప్రజల కష్టాలు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం పాలన సాగిస్తోంది. నియంత పోకడ అమలవుతోందని మండిపడ్డారు. అధికారంతో అణచి వేస్తామనే ధోరణి ప్రభుత్వంలో కనిపించడం దారుణమన్నారు. నియంతృత్వ పోకడలతోనే మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారన్నారు.
ములాఖత్‌లో సైతం
పోలీసులు పక్కనే ఉంటున్నారు
టెర్రరిస్టులు, మావోయిస్టులను
చూసినట్లు చూస్తున్నారు
మా కుటుంబంపై ఎందుకింత కక్ష?
ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి
ఎంపీ మిథున్‌రెడ్డితో శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
ప్రసాదరాజు ములాఖత్

స్వేచ్ఛగా మాట్లాడనివ్వరా..?