
పవన్ వల్లే ప్రాజెక్టు వస్తుందంటూ కౌంటర్
ఇదంతా జనసేన నేతలకు ఎంతమ్రాతం రుచించ లేదు. వర్మ ఉప్పాడ కోత పరిశీలనకు వెళ్లిన 48 గంటల్లోనే మర్రెడ్డి శ్రీనివాస్ సీఎం సహాయ నిధి చెక్‌ల పంపిణీ పేరుతో ఉప్పాడ తీరంలో పర్యటించారు. ఆ సందర్భంలోనే వర్మకు పరోక్షంగా మర్రెడ్డి ఇచ్చిన కౌంటర్ కూటమిలో ఇరుపార్టీల నేతల మధ్య రాద్ధాంతాన్ని తిరిగి రాజేసింది. సముద్ర కోత నివారణ విషయాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రాజెక్టు రిపోర్టు కూడా పవన్ సిద్ధం చేయించారని మర్రెడ్డి చెప్పుకొచ్చారు. వర్మకు ఆ రకంగా మర్రెడ్డి కౌంటర్ ఇవ్వడమే కాకుండా తమ నేత పవన్ వల్లే ఈ ప్రాజెక్టు వస్తుందని గొప్పలకు పోయారు. గత నెలలో ఉప్పాడ కొత్తపల్లి మండలం మల్లివారితోట–రావివారిపోడు గ్రామాల మధ్య బొండు ఇసుక తవ్వి తరలించుకుపోయేందుకు జనసేన నేతల ప్రయత్నాన్ని వర్మ తన అనుచరులతో కలిసి వెళ్లి అడ్డుకున్నారు. మర్రెడ్డి అనుచరుల ఇసుక అక్రమాలపై రోడ్డెక్కడం ద్వారా వైరి వర్గంపై వర్మ పై చేయి సాధించారు. అప్పట్లో ఇరు వర్గాలు కొట్లాటకు దిగగా పెద్దలు జోక్యంతో సర్దుబాటు అయ్యింది. ఇప్పుడు కొత్తగా ఉప్పాడ కోత రక్షణ ప్రతిపాదనలపై ఆధిపత్యం కోసం మాటల యుద్ధానికి తెర తీశారు. ఆ ప్రతిపాదనలు తమవంటే తమవని గొప్పలు చెప్పుకునే ప్రయత్నాలపై జనం విస్తు పోతున్నారు. కేవలం ప్రతిపాదనలకే ఈ స్థాయిలో నిస్సిగ్గుగా తలపడటంపై జనం పెదవి విరుస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు రప్పించి పనులు ప్రారంభించి అప్పుడు గొప్పగా ప్రకటించుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు. ఇలా పిఠాపురంలో ప్రతి చిన్న విషయంలోనూ ఆధిపత్యమే ఏకై క అజెండాగా జనసేన, టీడీపీ నేతలు చేస్తోన్న రాజకీయాలను పిఠాపురం ప్రజలు ఏవగించుకుంటున్నారు.