
రత్నగిరి విశ్రాంత ఈఓ పెన్షన్‌లో 25 శాతం కోత
● 1998–99లో అక్రమ కొనుగోళ్లపై అభియోగాలు
● విచారణ జరిపి ప్రభుత్వానికి
నివేదించిన ఏసీబీ
● ట్రిబ్యునల్ తీర్పుతో దేవదాయశాఖ
ముఖ్య కార్యదర్శి ఆదేశాలు
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయంలో గతంలో ఈఓగా పని చేసిన ఎన్.సోమశేఖర్ అవినీతికి పాల్పడినట్టు వచ్చిన అభియోగాలపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మేరకు ఆయన పెన్షన్‌లో 25 శాతం కోత విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వి.వినయ్‌చంద్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. 1998–99 కాలంలో ఆయన ఈఓగా ఉన్న కాలంలో టెండర్ పిలవకుండా నిబంధనలకు విరుద్ధంగా సత్యదేవుని వెండి స్టాండ్లు, క్యాలెండర్లు, గ్రీటింగ్ కార్డులు కొనుగోలు చేసినట్టు, మరో 17 అంశాలలో అవినీతికి పాల్పడినట్టు ఆయనపై, మరో 53 మంది సిబ్బందిపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏసీబీ అధికారులు విచారణ జరిపి ఆయన చర్యల వల్ల దేవస్థానానికి ఆర్థికంగా నష్టం వాటిల్లిందని, ఆయనపై చర్య తీసుకోవాలని 2018లో ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై ట్రిబ్యునల్ షోకాజ్ నోటీసు జారీ చేస్తూ ఆయన పెన్షన్‌లో 25 శాతం కోత విధిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆదేశాలపై సోమశేఖర్ బదులిస్తూ దేవస్థానంలో 20 ఏళ్లుగా కొనసాగుతున్న విధానం మేరకే తాను వాటిని కొనుగోలు చేశానని, వాటిని దేవదాయశాఖ కమిషనర్ సైతం ఆమోదించారని పేర్కొన్నారు. ఆ చర్యల వల్ల ఆలయానికి ఆర్థిక నష్టం జరగలేదని పేర్కొన్నారు. తాను 2013లో పదవీ విరమణ చేశానని, ఈ అభియోగాల వల్ల తన పెన్షన్ ప్రయోజనాలు పూర్తిగా అందడం లేదని, తనపై అభియోగాలు తొలగించి పూర్తి పెన్షన్ ఇవ్వాలని కోరారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చి ట్రిబ్యునల్ తీర్పు మేరకు పెన్షన్‌లో 25 శాతం కోత విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. కాగా, ఈ అభియోగాలపై జరిగిన విచారణలో 31 మంది సిబ్బందికి క్లీన్‌చిట్ ఇవ్వగా, మిగిలిన 22 మందిపై విచారణ కొనసాగుతున్నట్లు ఆ ఆదేశాలలో పేర్కొన్నారు.