
బాలల సంక్షేమం, సంరక్షణే ధ్యేయం
జిల్లా బాలల సంరక్షణ అధికారి శ్రీనివాసరావు
తుని రూరల్: బాలల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, వారి సంరక్షణే ధ్యేయం కావాలని జిల్లా బాలల రక్షణ అధికారి కె.శ్రీనివాసరావు అన్నారు. గురువారం తుని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సీడీపీఓ కె.శ్రీలత అధ్యక్షతన తుని, కోటనందూరు మండలాలకు చెందిన గ్రామస్థాయి బాలల సంక్షేమ, మండలస్థాయి పరిరక్షణ కమిటీల శిక్షణ తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల రక్షణ, హక్కుల రక్షణకు కమిటీ సభ్యులు కృషి చేయాలన్నారు. బాల్య వివాహాలను అడ్డుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారికే వివాహ ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని, బాల్య వివాహాలు చేసుకున్న వారికి సర్టిఫికెట్లు ఇస్తే సచివాలయ అడ్మిన్, కార్యదర్హులు కఠిన చర్యలకు గురవుతారన్నారు. అత్యవసరమైతే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. దత్తత ప్రక్రియపై పిల్లలు లేని తల్లిదండ్రులకు వివరించి, శిశుగృహాల గురించి చెప్పాలన్నారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలు, అనారోగ్యాలను తెలియజేయాలన్నారు. బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపులు, పోక్సో చట్టాలపై శిక్షణలో వివరించారు. చైల్డ్ హెల్ప్‌లైన్ కో ఆర్డినేటర్ బి.శ్రీనివాసరావు, ఏసీడీపీఓ కె.శ్రీకళ, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, వీఆర్వోలు, ఏఎన్‌ఎంలు, వార్డు మహిళా సంరక్షణ కాక్యదర్శులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది శిక్షణలో పాల్గొన్నారు.
శ్రీవారి ఆలయానికి
ముడి వెండి విరాళం
రాయవరం: మండల కేంద్రమైన రాయవరంలో కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయానికి గురువారం దాతలు ముడి వెండిని విరాళంగా అందజేశారు. గ్రామానికి చెందిన దుర్గపు వెంకన్నబాబు, సత్యరత్నభవాని దంపతులు, కుటుంబ సభ్యులు కలసి రూ.1.01 లక్షల విలువైన ముడి వెండిని మకర తోరణం తయారీ కోసం సమర్పించారు. వారిని గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ వుండవిల్లి రాంబాబు, స్థానిక నేతలు వల్లూరి శ్రీనివాస చౌదరి, పులగం శ్రీనివాసరెడ్డి, ఆలయ అర్చకులు పెద్దింటి కృష్ణమాచార్యులు అభినందించారు. ముక్కోటి ఏకాదశి సమయానికి మకర తోరణం సిద్ధం చేసేందుకు ఆలయ కమిటీ ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

బాలల సంక్షేమం, సంరక్షణే ధ్యేయం