
కాండ్రేగుల పాఠశాలలో అదనపు జిల్లా జడ్జి విచారణ
జగ్గంపేట: మండలంలోని కాండ్రేగుల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం 7వ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి జి.చంద్రమౌళీశ్వరి విచారణ నిర్వహించారు. ఈ నెల 17వ తేదీన పాఠశాలలో ఏడుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడం, వారికి ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుపత్రులలో చికిత్స అందించిన సంగతి తెలిసిందే. దీనిపై జిల్లా జడ్జి విచారణకు వచ్చి అస్వస్థతకు గురయిన విద్యార్థినులతోను, వైద్యం అందించిన డాక్టర్లతోనూ, విద్యార్థినులు తల్లిదండ్రులతో ఆరోజు జరిగిన ఘటన గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణ అనంతరం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. విద్యార్థినులకు కౌన్సెలింగ్ సెషన్ నిర్వహించాలని ఆమె మండల విద్యాశాఖాధికారికి సూచించారు. ఎంఈఓ స్వామి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ ప్రణీత్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థినులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఆరవ తరగతి ఆన్‌లైన్
దరఖాస్తుల గడువు పొడిగింపు
పెద్దాపురం: 2026–27వ ఏడాది పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయలో ఆరవ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు పొడిగించినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ బి.సీతాలక్ష్మి తెలిపారు. బుధవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆరవ తరగతి ప్రవేశానికి గడువు ఆగస్టు 13వ తేదీ వరకు పొడిగించారన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 2026–26 ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు.
యాంటీబయాటిక్స్,
డ్రగ్స్‌పై అవగాహన
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటి బయోటిక్స్ వాడడం వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని, ముందుగా యాంటీబయాటిక్స్, నార్కోటిక్ డ్రగ్స్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలని ఎస్పీ డి.నరసింహకిషోర్ సూచించారు. బుధవారం జిల్లా పోలీసు, ది రాజమండ్రి కెమిస్ట్సు, డ్రగ్గిస్ట్సు అసోసియేషన్, ఈగల్ టీం ఆధ్వర్యంలో యాంటీబయాటిక్స్, నార్కోటిక్స్, డ్రగ్స్‌పై అవగాహన ర్యాలీ, సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా ర్యాలీని జాంపేట చినగాంధీబొమ్మ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పోలీసు కల్యాణ మంటపంలో జరిగిన అవగాహన సదస్సులో ఎస్సీ నరసింహకిషోర్ మాట్లాడుతూ జిల్లాలో రెండు డ్రగ్ డిఅడిక్షన్ కేంద్రాలు ఉన్నాయని, ఇప్పటికే వాటికి అలవాటు పడినవారికి ఈ కేంద్రాల ద్వారా కౌన్సెలింగ్ ఇస్తున్నామని తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్న లేదా వినియోగిస్తున్న వారి వివరాలు పోలీసులకు తెలపాలని ఎస్పీ తెలిపారు.