
ఫుల్ వసూల్
అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమ పథకాలను అందించనప్పటికీ, మద్యాన్ని మాత్రం అందుబాటులోకి తీసుకువచ్చింది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అన్నిచోట్ల మద్యం షాపులను ఏర్పాటు చేసింది. దీనికి తోడు విచ్చలవిడిగా పెరిగిన బెల్టుషాపులతో మద్యం ఏరులై ప్రవహిస్తోంది. ఈ షాపుల్లో అమ్మకాల ద్వారా అక్రమార్జన ఎడాపెడా జరుగుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో లైసెన్స్ మద్యం షాపులు 150 లోపు ఉంటే, బెల్ట్ షాపులు దానికి దాదాపు ఏడు రెట్లు పెరిగాయి. లైసెన్స్ దుకాణాల వద్ద పర్మిట్ రూమ్‌ల పేరుతో మద్యం అమ్మకాలు ఫుల్‌గా సాగుతున్నాయి. బెల్ట్ షాపుల ద్వారా అక్రమంగా సరకును అమ్మేస్తున్నారు. లైసెన్స్ మద్యం షాపులకు అనుబంధంగా బెల్ట్ షాపులు ఉండవని, ఒక వేళ బెల్ట్ షాపుల్లో మద్యం పట్టుబడితే, సంబంధిత లైసెన్స్ షాపునకు రూ.5 లక్షలు జరిమానా విధించడంతోపాటు లైసెన్స్ కూడా రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎకై ్సజ్ అధికారులు చేస్తున్న ప్రకటనలు ఆచరణలో అమలు కావడం లేదు.
వెయ్యికి పైగా బెల్ట్ షాపులు
జిల్లాలో అధికారికంగా 146 లైసెన్స్‌డ్ మద్యం షాపులు, 10 బార్లు ఉన్నాయి. ఈ 146 అధికారిక షాపులకు అనుసంధానంగా దాదాపు వెయ్యికి పైగా బెల్ట్ షాపులు అనధికారికంగా నడుస్తున్నాయి. కలెక్టర్ ఇటీవల జిల్లా ఎకై ్సజ్ అధికారులతో ఓ సమావేశం నిర్వహించారు. బెల్ట్ షాపులకు ఏ విధమైన ఆస్కారం లేకుండా మద్యం షాపుల ద్వారానే విక్రయాలు జరగాలని ఆదేశించారు. అయితే ఎకై ్సజ్ అధికారుల పర్యవేక్షణా వైఫల్యం, లైసెన్స్ మద్యం షాపుల వారితో లాలూచీ వంటి కారణాలతో జిల్లాలో బెల్ట్ షాపులకు కొదవ లేకుండా పోయింది. మామూళ్ల మత్తుతోనే పర్మిట్ రూమ్‌లను, బెల్ట్ షాపులను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు బాహటంగా వినిపిస్తున్నాయి.
మామూళ్ల మత్తులో!
ఎకై ్సజ్ అధికారులను బెల్ట్ షాపుల గురించి అడిగితే ఎక్కడ ఉన్నాయని ఎదురు ప్రశ్నించే స్థాయిలో ఉన్నారు. బెల్ట్ షాపుల నిర్వహణలో ఆరి తేరిన వారుంటే, అలాంటి వారిపై లైసెన్స్ షాపుల యాజమానులతో మాట్లాడి పరస్పర అంగీకారం, అవగాహనతో కొందరిపై బైండోవర్ కేసులు నమోదు చేయడం ఎకై ్సజ్ అధికారులకు పరిపాటైపోయింది. అయితే పొరుగున్న ఉన్న పాండిచ్చేరి, యానాం నుంచి అక్రమ మద్యాన్ని (నాన్ డ్యూటీ పెయిడ్) తరలిస్తుంటే అధికారులు మాత్రం అలాంటి మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. అయితే కాట్రేనికోన తదితర మండలాల్లో రిమోట్ గ్రామాల్లో కొన్ని మద్యం షాపులు ప్రైవేటు వేలం పాట పరమవుతున్నా పట్టించుకోరు సరికదా, అసలు తమకు తెలియనట్లే వ్యవహరిస్తున్నారు. లైసెన్స్ షాపుల నుంచి సంబంధిత అధికారులకు ప్రతి నెలా అందుతున్న మామూళ్లతో ఇలా జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి.
అక్రమంగా అమ్మకాలకు ప్రోత్సాహం
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అవుట్ లెట్ల ద్వారా ప్రభుత్వమే పరిమితంగా మద్యం షాపులను నిర్వహిస్తే, ఈ కూటమి ప్రభుత్వం ప్రజల చేత మద్యాన్ని ఫుల్‌గా తాగించి అమ్మకాలను అయినకాడికి పెంచేసి, తద్వారా వచ్చే ఆదాయానికి ఆశపడి ఈ అడ్డదారులు తొక్కుతోంది. మద్యం విక్రయాలను అటు లైసెన్స్ షాపుల ద్వారా ఇటు బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌ల ద్వారా అదనంగా అమ్మేసి అక్రమార్జనకు పాల్పడుతోంది. ప్రజల జీవితాలు, ఆరోగ్యాలతో పనిలేదన్నట్లుగా, మద్యం అమ్మకాలే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ జిల్లాలో అక్రమ మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోంది.
యథేచ్ఛగా మద్యం అమ్మకాలు
పుట్ట గొడుగుల్లా బెల్ట్ షాపులు
నిబంధనలు బేఖాతరు
ఏరులై పారుతున్న మద్యం
రూ.కోట్లలో అక్రమార్జన
నకిలీ మద్యం కేసు
గత టీడీపీ ప్రభుత్వంలో, ఇప్పటి కూటమి ప్రభుత్వంలో బెల్ట్ షాపులతో మద్యం అక్రమ అమ్మకాలు సాగితే, అల్లవరం మండలం కొమరిగిరపట్నంలో ఏకంగా నకిలీ మద్యం తయారీ కేంద్రం గుట్టురట్టు అవడంతో కోనసీమ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏసీ బ్లాక్ పేరుతో నకిలీ మద్యం తయారీ యూనిట్‌ను, ఈ అక్రమ వ్యాపారంలో పాత్రధారులను ఎకై ్సజ్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో సూత్రధారులైన పెద్దలను వదిలేసి పాత్రధారులైన చిన్న వారిని మాత్రమే అరెస్ట్ చేశారన్న విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. ఈ నకిలీ దందా ఇక్కడ నుంచి సాగుతూ కోనసీమలోని పలు బెల్ట్ షాపులకు నకిలీ మద్యాన్ని సరాఫరా చేశారన్న గుసగుసలు కూడా వినిపించాయి. కేవలం కేరామిల్ లిక్విడ్, స్పిరిట్‌తో నకిలీ మద్యాన్ని తయారు చేసి నకిలీ లేబుళ్లతో ఓ బాటిలింగ్ యూనిట్‌నే మెయింటెన్స్ చేస్తున్న ఈ నకిటీ ముఠా స్థావరాన్ని చూసి ప్రజలు అవాక్కయ్యారు. రూ.10 కోట్ల మేర ఈ నకిలీ మద్యం కేంద్రం నుంచి పక్కదారి పట్టిందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ బాహటంగా స్పష్టం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో బెల్ట్ షాపుల కల్చర్ గత టీడీపీ ప్రభుత్వం కంటే రెట్టింపు అయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
మందుబాబులకు పండగే
జల్లా కేంద్రమైన అమలాపురంలోని ఎకై ్సజ్ కార్యాలయం సమీపంలోనే కొన్ని లైసెన్స్ షాపులకు పర్మిట్ రూమ్‌లు ఉన్నాయి. బారులతో సమాంతరంగా మద్యం షాపుల వద్ద కూడా మందుబాబులు ఫుల్‌గా తాగేస్తున్నారు. ఇక గుడి, బడి నిబంధనలను బెల్ట్ షాపుల నిర్వాహకులు అసలు పాటించడం లేదు. బెల్ట్ షాపు పట్టడమే ఓ నేరమైతే గుడి, బడికి 200 మీటర్ల దూరంలో పెట్టడం మరో నేరం. ఉదాహరణకు అమలాపురం రూరల్ మండలం బండార్లంక గ్రామంలో ఇలా బడి, గుడి నిబంధనలకు నీళ్లొదిలి బెల్ట్ షాపులు వెలిశాయి. అమలాపురం రూరల్, అయినవిల్లి, అల్లవరం, ఉప్పలగుప్పం, కాట్రేనికోన మండలాలతో పాటు జిల్లాలో అసలు బెల్ట్ షాపుల లేని గ్రామాలు లేవంటే అతిశయోక్తి కాదు.

ఫుల్ వసూల్

ఫుల్ వసూల్