గురువులపై బరువులు | - | Sakshi
Sakshi News home page

గురువులపై బరువులు

Jul 30 2025 6:56 AM | Updated on Jul 30 2025 6:56 AM

గురువ

గురువులపై బరువులు

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): చదువులు చెప్పే గురువులపై కూటమి ప్రభుత్వం బోధనేతర పనుల బరువులు మోపుతోంది. నానాటికీ ఈ భారం పెరుగుతోందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. దీనిపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ప్రతి రోజూ వాట్సాప్‌లో అర్జెంట్‌.. మోస్ట్‌ అర్జెంట్‌.. అంటూ మెసేజ్‌లు, ఆన్‌లైన్‌ పనులపై ఆదేశాలు ఇస్తూండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో మొత్తం 1,285 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో దాదాపు 5,100 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వేసవి సెలవుల అనంతరం జూన్‌ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఆ తర్వాత స్కూల్‌ ఆర్గనైజేషనల్‌ టీములు (ఎస్‌ఓటీ), ఎంటీఎస్‌, బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహణతో 15 రోజులు గడచిపోయాయి. అనంతరం, గిన్నిస్‌ రికార్డు పేరిట జూన్‌ 21న చేపట్టిన యోగాంధ్ర కోసం పాఠశాలల్లో ముందస్తు కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో ఉపాధ్యాయులను, విద్యార్థులను భాగస్వాముల్ని చేశారు. ఈ నెల 10న నిర్వహించిన మెగా పేరెంట్స్‌ – టీచర్స్‌ మీట్‌(పీటీఎం)కు పది రోజులు ముందుగానే సన్నాహక కార్యక్రమాలు నిర్వహించారు. ఇవి ముగించుకుని హమ్మయ్యా.. అనుకునేసరికి ఈ నెల 14 నుంచి స్కూల్‌ లీడర్‌షిప్‌, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం (ఎఫ్‌ఎల్‌ఎన్‌) వంటి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించారు. ఇటువంటి వాటితో తమ సమయం వృథా అవుతోందని, అనివార్యంగా బోధనకు దూరమవ్వాల్సి వస్తోందని టీచర్లు అంటున్నారు.

యాప్‌లతో ఉక్కిరిబిక్కిరి

ఫ పాఠశాల విద్యా శాఖలో ఉన్న అన్ని యాప్‌లను ఒకే వేదికపై తీసుకువచ్చి లెర్నింగ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌ (లీప్‌) యాప్‌ రూపొందించారు. దానిలోనే ఐఎంఎంఎస్‌, స్టూడెంట్‌ కిట్స్‌, మెగా పీటీఎం వంటివన్నీ ఉంచారు.

ఫ సర్వర్‌ సక్రమంగా లేకపోవడంతో ఆన్‌లైన్‌లో టీచర్‌ ఫొటో హాజరు నమోదు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆలస్యమవుతోంది.

ఫ మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం అందిస్తున్నారు. ప్రతి నెలా పాఠశాలకు అందిన అన్ని బియ్యం బస్తాలపై క్యూఆర్‌ కోడ్‌లను ఉపాధ్యాయులు స్కాన్‌ చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. వంటకు ముందు ఆ బస్తా తెరచిన ప్రతిసారీ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి, బియ్యం నాణ్యతను పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి.

ఫ బియ్యం, సరకులు, యూనిఫాం, పాఠ్య పుస్తకాల వంటివి డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ నుంచి తెచ్చుకోవడం తదితర పనులను ఉపాధ్యాయులే చేయాల్సి వస్తోంది.

ఫ వివిధ పనులకు సంబంధించి ఉన్నత పాఠశాలల్లోని ఉపాధ్యాయులు 500 నుంచి వెయ్యి వరకూ ఫొటోలు అప్‌లోడ్‌ చేయాల్సి వస్తోంది. ఇంటర్‌నెట్‌, సర్వర్‌ సమస్యతో ఇవి ఏ సమయానికి అప్‌లోడ్‌ అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీనివలన టీచర్ల సమయం వృథా అవుతోంది.

ఫ ఇవి చాలవన్నట్టు ఈ నెల 28 నుంచి లీడర్‌షిప్‌ ట్రైనింగ్‌ రెండో విడత నిర్వహిస్తున్నారు. మండల స్థాయిలో హెచ్‌ఏంలు, ఎంఈఓలు గంటల తరబడి ఈ సమావేశాల్లో పాల్గొనాల్సి వస్తోంది.

ఫ ఆగస్టు 4 నుంచి ఎఫ్‌ఎ–1 పరీక్షలున్నందున సిలబస్‌ పూర్తి చేయాల్సి ఉందని, ఈ సమయంలో తమపై ఇన్ని బోధనేతర పనులు మోపడమేమిటని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పొజిషన్‌ ఐడీలు రాక..

బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముగియడంతో జిల్లావ్యాప్తంగా దాదాపు 1,400 మంది ఉపాధ్యాయులు ఆయా ప్రాంతాలకు వెళ్లారు. గతంలో రెగ్యులర్‌గా జీతాలు తీసుకుంటున్నప్పటికీ బదిలీ అనంతరం మరో స్థానానికి వెళ్లడంతో వారికి ప్రభుత్వం పొజిషన్‌ ఐడీ కేటాయించాలి. ఇది జరిగితేనే సీఎఫ్‌ఎంఎస్‌లో వారి వివరాలు కనిపిస్తాయి. కానీ, ప్రభుత్వం ఇప్పటి వరకూ పొజిషన్‌ ఐడీలు కేటాయించకపోవడంతో వారికి జీతభత్యాలు నిలిచిపోయాయి. బదిలీ అయిన ప్రాంతాల్లో జీతాలు తీసుకునేలా అక్కడి డీడీఓకు సమాచారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అలానే మున్సిపల్‌ ఉపాధ్యాయులు మార్కాపురం తదితర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. ట్రెజరీ మారడంతో వారికి కూడా పొజిషన్‌ ఐడీలు కేటాయించాల్సి ఉంది. అలాగే, మోడల్‌ ప్రైమరీ స్కూల్‌, అప్‌గ్రేడ్‌ చేసిన ఉన్నత పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులున్న చోట అదనంగా మరో మూడు పోస్టులు ఇచ్చారే గానీ.. పొజిషన్‌ ఐడీలు కేటాయించలేదు. అలా జరగకపోవడంతో జీతాలు రాక వారందరూ సతమతమవుతున్నారు. బదిలీ అయిన వారికి జూన్‌ నెల జీతాలు ఇప్పటి వరకూ రాలేదు. ఈ నెలలో కూడా ఐడీలు రాకపోతే ఆగస్టులో కూడా జీతాలు అందుకోలేని పరిస్థితి. బదిలీపై వెళ్లిన ప్రాంతంలో ఇంటి అద్దెలు, రవాణా, అడ్వాన్సుల రూపంలో ఉపాధ్యాయులకు ఖర్చు మరింత పెరిగింది. ఈ పరిస్థితుల్లో జీతాలు నిలిచిపోవడంతో వారు సతమతమవుతున్నారు.

పీ–4పై ఒత్తిళ్లు

మరోవైపు ప్రభుత్వం పీ–4 (పబ్లిక్‌, ప్రైవేట్‌, పీపుల్స్‌, పార్టనర్‌షిప్‌) పేరిట ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తోంది. ప్రధానోపాధ్యాయులు 5, ఉపాధ్యాయులు 2 చొప్పున పేద కుటుంబాలను తప్పనిసరిగా దత్తత తీసుకోవాలంటూ ఆంక్షలు పెడుతోంది. రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తోంది. దీనిని ఉపాధ్యాయులు తప్పు పడుతున్నారు. ఇప్పటికే బోధనేతర పనులతో సతమతమవుతూంటే కొత్తగా పీ–4 పేరిట పేదరిక నిర్మూలనతో తమనెందుకు కలుపుతున్నారని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టిన ఈ కార్యక్రమానికి సంపన్నులు, కార్పొరేట్‌ సంస్థలు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వోద్యోగులపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబడుతున్నారు. ఉపాధ్యాయుల ఆగ్రహం నేపథ్యంలో పీ–4 రుద్దడంపై ప్రభుత్వం ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్టు చెబుతున్నారు.

ఫ బోధనేతర పనులతో సతమతం

ఫ యాప్‌లు, ఆన్‌లైన్‌

నమోదులతో ఇక్కట్లు

ఫ తాజాగా పీ–4పై ఆదేశాలు

ఫ బంగారు కుటుంబాలను

దత్తత తీసుకోవాలంటూ ఒత్తిళ్లు

ఫ మండిపడుతున్న ఉపాధ్యాయులు

జీతాలు వెంటనే చెల్లించాలి

బదిలీ అయిన ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించాలి. ప్రస్తుతం మోడల్‌ ప్రైమరీ పాఠశాలలో అదనపు ఉపాధ్యాయ పోస్టులు కేటాయించారు. పదోన్నతిపై వచ్చిన వారికీ ఇవే ఇబ్బందులు. ఈఎంఐలు కట్టలేక కష్టాలు పడుతున్నారు. యాప్‌లు తగ్గిస్తామని చెప్పినా అన్ని అప్లికేషన్లూ ఒకే యాప్‌లోకి తీసుకొచ్చి నానా యాతనా పెడుతున్నారు.

– చింతాడ ప్రదీప్‌కుమార్‌,

పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు

ఒత్తిడి తగ్గించాలి

ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తప్పించాలి. నిత్యం ఏదో ఒక పని చెప్పడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. యాప్‌ల భారం ఎక్కువైంది. వెరీ అర్జెంట్‌... మోస్ట్‌ అర్జెంట్‌ అంటూ మెసేజ్‌ల వల్ల సమయం వృథా అవుతోంది. పీ–4 కార్యక్రమంలో ఉపాధ్యాయులకు ఆప్షన్‌ ఇవ్వాలే తప్ప తప్పనిసరి చేయకూడదు.

– మెర్త శ్రీనివాస్‌ ఎస్‌టీయూ

కాకినాడ జిల్లా అధ్యక్షులు

గురువులపై బరువులు1
1/2

గురువులపై బరువులు

గురువులపై బరువులు2
2/2

గురువులపై బరువులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement