
ఈసారైనా ఖరారయ్యేనా!
అన్నవరం: సాధారణంగా ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని చెప్పి.. తుదిగా వచ్చిన మొత్తానికి వేలం పాట ఖరారు చేస్తారు. ఒకవేళ ఒకటి రెండుసార్లు ఆశించిన మొత్తానికి వేలంపాట వెళ్లకపోతే పాటదారులతో అధికారులు సమావేశమవుతారు. వారి ఇబ్బంది తెలుసుకుని, దాని ప్రకారం కొంత మొత్తం తగ్గించైనా మూడోసారి పాట ఖరారు చేస్తారు. లేకపోతే ఆ మేరకు నష్టం కలుగుతుంది. కానీ, అన్నవరం దేవస్థానంలో మాత్రం అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. భక్తులు ఇబ్బంది పడినా, దేవస్థానానికి రూ.లక్షల్లో ఆదాయం నష్టం వచ్చినా పట్టించుకోవడం లేదు.
ఏం జరుగుతోందంటే..
రత్నగిరిపై ఈఓ కార్యాలయం దిగువన దాదాపు 70 సంవత్సరాల నుంచి మెయిన్ క్యాంటీన్ ఉంది. స్వామివారి ఆలయానికి మెట్ల మార్గంలో రాకపోకలు సాగించే భక్తులకు ఇక్కడ టీ, కాఫీ, ఫలహారాలు, భోజనం లభించేవి. దీనికి నెలకు రూ.8 లక్షల వరకూ వేలం పాట జరిగేది. ఏడాదికి రూ.కోటి పైగానే ఆదాయం వచ్చేది. పశ్చిమ రాజగోపురం వెనుక, సత్యగిరిపై సత్రాలు, రెండో ఘాట్ రోడ్డు నిర్మాణాలు జరిగాక భక్తులు అటు నుంచే సత్యదేవుని ఆలయానికి రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే, సత్రాల్లో బస చేసేవారి కోసం సీతారామ సత్రం వద్ద సబ్ క్యాంటీన్ ఏర్పాటు చేశారు. దీంతో, మెయిన్ క్యాంటీన్‌లో వ్యాపారం తగ్గింది. ఆ తరువాత సత్యగిరిపై శివసదన్ వద్ద మరో క్యాంటీన్ కూడా ఏర్పాటు చేశారు. రెండు క్యాంటీన్లు అదనంగా రావడంతో మెయిన్ క్యాంటీన్‌కు వ్యాపారం మరింత తగ్గింది. దీనికితోడు ఉదయం 8 నుంచి 10 గంటల వరకూ భక్తులకు దేవస్థానం పులిహోర, దద్ధోజనం పంపిణీ చేస్తూండటంతో ఆ క్యాంటీన్‌లో ఫలహారం తినేవారు కూడా తగ్గారు. దీంతో వ్యాపారం తగ్గింది.
అయితే, అధికారులు వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవడం లేదు. గతంలో మాదిరిగానే నెలకు రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ ఆదాయం వస్తేనే పాట ఖరారు చేస్తామని చెబుతున్నారు. గత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకూ ఏడుసార్లు వేలం నిర్వహించారు. అయితే, వ్యాపారం తగ్గిందంటూ పాటదారులు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ మాత్రమే పాడుతున్నారు. గత నెలలో నిర్వహించిన ఆరో విడత వేలంలో రూ.4.20 లక్షలకు మాత్రమే పాట వెళ్లింది. కానీ, ఎక్కువ మొత్తం రాలేదని దీనిని ఖరారు చేయలేదు. ఏడోసారి వేలం నిర్వహిస్తే రూ.2.75 లక్షలకు మాత్రమే పాట వెళ్లింది. దీంతో అదీ ఖరారు చేయలేదు. ఇలా అధికారులు వాయిదా వేస్తూండటంతో గడచిన 9 నెలలుగా దేవస్థానం సుమారు రూ.30 లక్షల వరకూ ఆదాయం కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 6న ఈ క్యాంటీన్‌కు ఎనిమిదోసారి వేలం నిర్వహించనున్నారు. హెచ్చు మొత్తానికి వేలం జరగాలని ఆశిస్తున్నారు. అయితే, నెలకు రూ.4 లక్షలకు మించి వెళ్లే అవకాశం లేదని పాటదారులు చెబుతున్నారు. ఈసారైనా ఖరారు చేస్తారో లేదో వేచి చూడాలి. ఒకవేళ ఈసారి కూడా పాట ఖరారు కాకపోతే దేవస్థానం సొంతంగానే సాయంత్రం వేళ టీ, కాఫీ, ఫలహారాలు విక్రయించాలని భక్తులు కోరుతున్నారు.
భక్తులకు ఇబ్బందులు
మెయిన్ క్యాంటీన్ పక్కనే దాత నిర్మించిన నాలుగంతస్తుల ఉచిత డార్మెట్రీలో ప్రతి రోజూ సుమారు 300 మంది భక్తులు బస చేస్తూంటారు. సేవ చేయడానికి వస్తున్న వారికి కూడా ఇక్కడే వసతి కల్పిస్తున్నారు. పగలు పెద్ద ఇబ్బంది లేకపోయినా రాత్రి వేళల్లో టీ, కాఫీ, ఫలహారాలు లభించక వీరందరూ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సబ్ క్యాంటీన్ వద్దకు ఆటోలో వెళ్లి ఫలహారం తిని రావాల్సి వస్తోంది. రానూపోనూ ఆటోకు మనిషికి రూ.50 వసూలు చేస్తున్నారు. దీంతో, టిఫిన్ కోసం భక్తులు రూ.100 నుంచి రూ.150 వరకూ ఖర్చు చేయాల్సి వస్తోంది.
ఫ 9 నెలలుగా మూతపడి ఉన్న
మెయిన్ క్యాంటీన్
ఫ దేవస్థానానికి రూ.30 లక్షల నష్టం
ఫ ఆగస్టు 6న 8వసారి వేలం