
ఆరోగ్యవంతం.. కోరంగి మడ అటవీ ప్రాంతం
తాళ్లరేవు: దేశంలోనే రెండో అతిపెద్ద మడ అటవీ ప్రాంతమైన కోరంగి అభయారణ్యం కల్‌కతాలోని సుందర్‌బన్స్‌తో పోలిస్తే ఆరోగ్యవంతమైందని ఫారెస్ట్ రేంజర్ ఎస్‌ఎస్‌ఎస్‌ఆర్ వరప్రసాదరావు అన్నారు. శనివారం కోరంగి బయోడైవర్సటీ కాంప్లెక్స్‌లో అంతర్జాతీయ మడ అడవుల దినోత్సవాన్ని వరప్రసాదరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరింగ అభయారణ్యంలో ఏడాదికి నాలుగు నెలలపాటు గోదావరి నీరు పుష్కలంగా లభించడంతో ఆరోగ్యవంతమైన వృక్ష, మత్స్య సంపద అభివృద్ధి చెందుతుందన్నారు. సునామీలు, తుపాన్ల నుంచి రక్షించే మడ అడవులను హోప్ ఐలాండ్ దీవిలో పెంచుతున్నట్లు తెలిపారు. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రముఖ పర్యావరణవేత్త కె.మృత్యుంజయరావు మాట్లాడుతూ మడ అడవులు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతానికి 111 రకాల వలస పక్షులు వస్తున్నాయని, వాటిలో చాలావరకు సముద్ర పక్షులేనని తెలిపారు. ఫిషింగ్ క్యాట్ నిపుణులు కునాల్ గోకుల్, అల్ ఈజ్ వెల్ అధ్యక్షుడు ఎన్.కిషోర్‌కుమార్ తదితరులు మడ అడవులు, వన్యప్రాణుల ప్రాముఖ్యత, వాటి పరిరక్షణ తదితర అంశాలను వివిధ కళాశాలల నుంచి హాజరైన విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌ఓలు సింగ వీరభద్రరావు, కుంచే సిద్ధార్థ, ఎఫ్‌బీఓలు కె.మహేష్, కె.ధనుంజయరావు, పి.సంధ్యారాణి, సీహెచ్ ధన లక్ష్మి, డి.మహేష్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు.