
రుణాల వసూళ్లకు ప్రత్యేక చర్యలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రుణాల వసూళ్లకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి అన్నారు. కాకినాడ డీసీసీబీ కార్యాలయంలో శనివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 52 డీసీసీబీ బ్రాంచ్‌ల్లో మేనేజర్లు, ఇతర సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం నష్టాల బాటలో ఉన్న డీసీసీబీని రెండేళ్లలో లాభాల బాటలో నడిపించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. రుణాల వసూళ్లు బాగుంటేనే డీసీసీబీ బాగుంటుందన్నారు. గతంలో బినామీ పేర్లతో రుణాలు అధికంగా ఇచ్చిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆయా రుణాల మంజూరుకు సహకరించిన బ్యాంకు సిబ్బందిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఆయా రుణాలను వారి నుంచి రికవరీ చేస్తామన్నారు. పిఠాపురం బ్రాంచ్ పరిధి బి.కొత్తూరు గ్రామంలో డ్వాక్రా సంఘాల సభ్యులు రుణాలు తీసుకుని తిరిగి కట్టడం లేదన్నారు. చిన్న గ్రామమైనప్పటికీ ఆ గ్రామంలో లేనివారి పేర్లతో కూడా రుణాలు తీసుకుని బ్యాంకుకు ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదన్నారు. ప్రస్తుతం ఇటువంటి రుణాల వసూళ్లకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ తరహా రుణాల మంజూరుకు ఏఏ అధికారులు సహకరించారో వారిపై చర్యలు తప్పవన్నారు. అనంతరం అన్నీ బ్రాంచ్‌లు సిబ్బందిని ఎంత మేర రుణాలు ఇచ్చారు, ఎంత తిరిగి చెల్లించారు, రుణాలు రికవరీకి తీసుకొంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీసీసీబీ ఇన్‌చార్జ్ సీఈఓ ప్రవీణ్‌కుమార్, డీజీఎం శ్రీధర్ పాల్గొన్నారు.