
సంక్షామ హాస్టళ్లు
కరప మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయం (బాలుర)లో వసతులులేక విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. తరగతికి, పడుకోవడానికి విడిగా గదులులేవు. పగలు తరగతిగా, రాత్రి పడక గదిగా వినియోగిస్తున్నారు. కిటికీలకు, గుమ్మాలకు, వరండాలలో ఉతికిన దుస్తులు ఆరబెట్టుకుంటున్నారు. 450 మంది ఉండాల్సిన గురుకుల విద్యాలయంలో సరిపడా తరగతి గదులు, వసతి గదులు లేక విద్యార్థుల సంఖ్య సగానికి సగం పడిపోయింది. డైనింగ్ హాల్ లేక నేలపై భోజనాలు చేసే పరిస్థితుల్లో రెండు నెలల క్రితం రేకుల షెడ్ నిర్మించి, డైనింగ్‌హాల్‌కు కేటాయించారు. ఈ హాస్టల్‌కు ప్రహారీగోడ లేక కుక్కలు, పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నా, ఆకతాయిలతో రాత్రి పూట విద్యార్థులు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఇరుకు గదిలో 20, 30 మంది విద్యార్థులు. ఒకే గదిలో బోధన, భోజనం. కటిక నేలపై తిండీ తిప్పలు.. కూలిపోయిన ప్రహరీలు. కుక్కలు, పందులతో సావాసం. చీకటి పడితే భయం. ఇంటి నుంచి తెచ్చిన దుప్పట్లే దిక్కు. కూటమి పాలనలో జిల్లాలోని వసతిగృహాల దుస్థితి ఇది. కోట్లు ఖర్చు చేస్తున్నా వసతి గృహాల్లో సౌకర్యాలు ఎందుకు దిగజారిపోతున్నాయంటూ ఉన్నత న్యాయస్థానం ఇటీవల కూటమి సర్కార్‌కు అక్షింతలు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలోని వసతి గృహాల్లో స్థితిగతులపై ‘సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశీలన ఇది. ఈ సందర్భంగా విద్యార్థులు అనేక సమస్యలు ఏకరువు పెట్టారు. ప్రత్తిపాడు, ఏలేశ్వరం, తుని, కరప, జగ్గంపేట, పెద్దాపురం, సామర్లకోట, తాళ్లరేవు తదితర మండలాల్లోని వసతిగృహాల్లో సమస్యల సమాహారమిది.
● తుని డి.పోలవరంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌లో అడ్మిషన్లు కరువయ్యాయి. హాస్టల్, పాఠశాల మధ్య కిలో మీటరు దూరం. హాస్టల్‌కు వెళ్లాలంటే ప్రధాన రహదారి దాటాలి. ఏ ప్రమాదాల బారిన పడతారో అని తల్లిదండ్రులు అందులో పిల్లలను చేర్చడంలేదు. మూడు నుంచి పదో తరగతి వరకు ఈ ఏడాది కూడా ఎవరూ చేరక విద్యార్థుల సంఖ్య 20కి పడిపోయింది. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలైనా వారికి కనీసం యూనిఫాం, దుప్పట్లు ఇవ్వలేదు. వెంట తెచ్చుకున్న దుస్తులు, దుప్పట్లే దిక్కయ్యాయి. ఇనుప మంచాలపై నిద్ర వారికి నరకప్రాయంగా ఉంది. మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు విడుదల కాక వడ్డీలకు అప్పులు తెచ్చి విద్యార్థులకు భోజనాలు పెడుతున్న దుస్థితి.
● ప్రత్తిపాడు ఎస్సీ బాలుర వసతి గృహంలో 116 మంది, బీసీ బాలిక వసతి గృహంలో 110 మంది విద్యార్థులు ఉన్నారు. హాస్టళ్ల పరిసరాల్లో దోమలతో విద్యార్థులు నరకం చూస్తున్నారు. ప్రభుత్వం కనీసం దోమ తెరలను కూడా పంపిణీ చేయలేకపోయింది. దీంతో విద్యార్థులు జ్వరాల పాలవుతున్నారు. రెండు హాస్టళ్లలో విద్యార్థులకు నేలపై నిద్రపోతున్నారు. బీసీ బాలికల హాస్టల్‌కు మంచాలు మంజూరు చేసినా సరిపడా గదులు లేక వినియోగంలోకి తీసుకురాలేదు. ఎస్సీ బాలుర హాస్టల్‌లోనూ నేలపైనే నిద్ర. ఈ హాస్టల్ బయట పేరుకుపోయిన మురుగునీటితో దోమలు పెరిగి విద్యార్థులు జ్వరాల బారిన పడుతున్నారు.
● ఏలేశ్వరంలో బాలుర వసతిగృహానికి గుక్కెడు నీరు కరువైంది. ఆర్వో వాటర్ ఫిల్టర్ పనిచేయక కుళాయి నీరు తాగుతూ జ్వరాల బారిన పడుతున్నారు. హాస్టల్ కిటికీల అద్దాలు పగిలిపోవడంతో దోమలతో నరకం చూస్తున్నారు. బాలికల వసతిగృహంలో ఫ్యాన్లు లేకపోవడంతో విద్యార్థులు ఉక్కపోతకు గురవుతున్నారు.
● జగ్గంపేట శివారు యానాదుల కాలనీ వద్ద వున్న బాలికల వసతి గృహం శిథిలావస్థకు చేరుకుంది. బీసీ వెల్ఫేర్ వసతి గృహ విద్యార్థులకు మెస్ చార్జీలు, కాస్మెటిక్ చార్జీలు విడుదల కాలేదు. ఐదు నెలల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో హాస్టల్ నిర్వహణ కష్టంగా ఉంది. ఒక్కొక్క విద్యార్థికి చెల్లిస్తున్న మెస్ చార్జీలు రూ.53 ఏ మూలకూ రావడం లేదు.
● గోకవరం మండలంలో ఎస్సీ బాలుర, ఎస్టీ బాలికల వసతి గృహాలు ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తుండగా బాలికల వసతి గృహాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు.
● తాళ్లరేవు మండలంలో బీసీ బాలికల వసతి గృహాన్ని ప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్నారు. సుమారు 60 మంది విద్యార్థినులు ఉన్న అద్దె భవనం పురాతనమైనది కావడంతో అస్తవ్యస్తంగా ఉంది. ఒక గదిలో సుమారు 20 మంది విద్యార్థులు ఉంటున్నారు. బీసీ ఎస్సీ బాలుర వసతి గృహాలలో ఒకే గదిలో ఇరుకిరుకుగా 15 నుంచి 20 మంది ఉంటున్నారు. ఎస్సీ బాలుర హాస్టల్‌కు వెళ్లే రహదారి అధ్వానంగా ఉండటంతో విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం.
● పెద్దాపురం బీసీ బాలికల హాస్టల్‌లో భోజనం అధ్వానంగా ఉంటోందని బాలికలు స్వయంగా కలెక్టరుకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. పెద్దాపురంలో బీసీ బాలికల, బాలుర, ఎస్సీ బాలికల హస్టళ్లు ఉన్నాయి. ఈ హాస్టళ్లలో గతంలో మెరుగైన సదుపాయాలు ఉండటంతో వీటికి మంచి డిమాండ్ ఉండేది. ప్రస్తుత ఈ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. మూడు హాస్టళ్లు శిథిలావస్థకు చేరినా ఎవరికీ పట్టడంలేదు. బీసీ బాలుర హాస్టల్ ప్రహరీ కూలిపోవడంతో పాముల భయం వెంటాడుతోంది. బీసీ బాలికల హాస్టల్ ప్రహరీ చుట్టు పిచ్చి మొక్కలు పెరిగి అక్కడ సైతం పాముల భయాన్ని ఎదుర్కొంటున్నారు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉండటంతో బాలికలు ఇబ్బందులకు గురవుతున్నారు.
● సామర్లకోట బీసీ బాలుర హాస్టల్ శిథిలం కావడంతో ఇరుకుగా ఉన్న అద్దె భవనంలోనే కాలక్షేపం చేస్తున్నారు. బీసీ బాలిక హాస్టల్ చుట్టూ మురుగునీరు, సెప్టిక్లీన్ ట్యాంకర్లు పార్క్ చేయడంతో దోమలతో పాటు దుర్వాసన భరించలేకపోతున్నామని విద్యార్థులు అంటున్నారు. గతంలో 25 మంది ఉండే ఈ హాస్టల్‌లో నేడు ఐదుగురు మాత్రమే ఉంటున్నారు.
ఇరుకిరుకు గదిలో 20 మంది
కటిక నేలపైనే తిండీ తిప్పలు
చీకటిపడితే భయంభయం
కొరవడిన మౌలిక వసతులు
పట్టించుకోని కూటమి పాలకులు
అసౌకర్యాల ‘చెర’లో వసతిగృహాలు

సంక్షామ హాస్టళ్లు

సంక్షామ హాస్టళ్లు

సంక్షామ హాస్టళ్లు

సంక్షామ హాస్టళ్లు