మానవపాడు: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమం క్షేత్రస్థాయిలో అభాసుపాలవుతోంది. అడవులు పెంచాలని, చెట్టను పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా.. క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం మూలంగా నీరుగారుతోంది. ప్రతిఏటా వన మహోత్సవం పేరుతో లక్షల్లో మొక్కలు నాటుతున్నామని అధికారులు గొప్పగా చెప్పుకొంటున్నా.. నాటిన మొక్కలను సంరక్షించడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నారు. నాటడం వరకే తమ బాధ్యత అన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. మొక్కలు నాటుతూ ఫొటోలకు ఫోజులు ఇవ్వడం.. లెక్కల్లో చూపించడం తప్ప క్షేత్రస్థాయిలో పచ్చదనం కనిపించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారులు ప్రతిఏటా నాటిన మొక్కల సంఖ్యను లెక్కల్లో కలుపుకొంటూ పొతున్నారు. కానీ, వాస్తవంగా బతికి ఉన్న మొక్కలపై ఎప్పుడూ సర్వే చేయడం లేదు. నాటిన ప్రతి మొక్క ప్రభుత్వం ఖర్చు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో బతికి ఉన్నా మొక్కల సంఖ్య జిల్లావ్యాప్తంగా కోట్లలో ఉండాలి. లక్షలో నాటి.. లెక్కల్లో చూపి బతికి ఉన్న మొక్కల వివరాలు మాత్రం లెక్కలు లేకుండా పోయాయని జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతి వర్షాకాలంలో మొక్కలు నాటే కార్యక్రమాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున ప్రచారం కల్పిస్తున్నారు. రోడ్ల వెంట, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటుతున్నారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత వాటి సంరక్షణను పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో అనేక మొక్కలు ఎండిపోయి.. ఖాళీ ప్రదేశాలుగా దర్శనమిస్తున్నాయి.
నాటుతారు.. నరుకుతారు
జిల్లావ్యాప్తంగా ఆయా మండలాల్లో గ్రామాల్లోని విద్యుత్ స్తంభాల కింద, పంట పొలాల గెట్ల కింద మొక్కలు నాటడం.. ఆ తర్వాత పెరిగి.. వాటికి అడ్డుగా మారాయని నరకడం పరిపాటిగా మారింది. ఫలితంగా ప్రజాధనం వృథా అవుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్య వైఖరిని మాత్రం మార్చుకోవడం లేదు. ఒక ప్రణాళిక, లక్ష్యంగా ముందుకు సాగి.. ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏపుగా పెరిగేలా మొక్కలు నాటాలన్న విచక్షణ కూడా లేకపోవడం బాధాకరం. ఇకనైనా ఈ తీరు మారి మొక్కలు నాటడంతోపాటు సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంది.
నాటడమే కానీ, సంరక్షణ మరిచిన అధికారులు
లక్షల్లో నాటుతున్నట్లు లెక్కల్లో చూపుతున్న వైనం
బతుకుతున్నవెన్నో చెప్పలేని దుస్థితి
ఆనవాళ్లు లేకుండాపోయిన గతంలో నాటిన మొక్కలు
క్షేత్రస్థాయిలో నీరుగారుతున్న వనమహోత్సవ లక్ష్యం


