అమరచింత: భూత్పురు రిజర్వాయర్ ప్రధాన ఎడమ కాల్వ పరిధిలో చివరి ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఎగువన ఉన్న రైతులు కాల్వ తూముల షట్టర్లను పగులగొట్టి సాగునీటిని తమ తమ గ్రామాలకు తీసుకెళ్తుండటంతో దిగువన ఉన్న పంట పొలాలకు సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. భూత్పురు రిజర్వాయర్ నుంచి అమరచింత, ఆత్మకూర్ మండలాలకు సాగునీరు అందించే భూత్పురు కాల్వ వెంట ఆయకట్టు రైతులు నిత్యం తిరగాల్సిన దుస్థితి నెలకొంది.
32వేల ఎకరాల ఆయకట్టు..
భూత్పురు రిజర్వాయర్ ప్రధాన ఎడమ కాల్వ పరిధిలో మక్తల్, నర్వ, అమరచింత, ఆత్మకూర్ మండలాలు ఉండగా.. మొత్తం 35 గ్రామాల్లోని 32వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రతి వర్షాకాలంలో జూరాల ప్రాజెక్టుకు వచ్చే వరద నీటిని భూత్పుర్ రిజర్వాయర్‌కు.. అక్కడి నుంచి కాల్వల ద్వారా ఆయకట్టుకు సాగునీటిని వదులుతున్నారు. ఈసారి గత జూలైలో ప్రధాన ఎడమ కాల్వకు సాగునీటిని విడుదల చేశారు. అయితే చివరన ఉన్న అమరచింత పెద్ద చెరువు, పిన్నంచర్ల గ్రామ చెరువుల్లోకి సాగునీరు చేరుకోలేకపోవడంతో ఆయా గ్రామాల రైతులు ఆవేదనకు గురవుతున్నారు. ఏడాది పొడవునా కేవలం ఒకే ఒక పంటను పండించుకునే రైతులకు ఈసారి సాగునీరు వస్తుందని ఆరుతడి పంటలను సాగుచేసుకున్నారు. తీరా కాల్వ ద్వారా సాగునీరు రాకపోవడం.. నీటిని ఎగుమ గ్రామాల రైతులు మళ్లించుకుని వెళ్తున్నారా అనే విషయాన్ని తెలుసుకునేందుకు అమరచింత, పిన్నంచర్ల గ్రామాల రైతులు నిత్యం నర్వ మండలం నాగిరెడ్డిపల్లి, యాంకి గ్రామాల వరకు కాల్వ వెంట వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఆందోళనలో రైతులు..
భూత్పురు కాల్వ నీటిని మళ్లించుకునే యత్నంలో భాగంగా నీరు ముందుకు వెళ్లకుండా తూముల షట్టర్లను పగులగొట్టి మూసి ఉంచుతుండటంతో చివరి ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. అమరచింత మండలంలోని ధర్మపురం గ్రామానికి సాగునీటిని మళ్లించే తూముతో పాటు మస్తీపురం గ్రామానికి సాగునీటిని మళ్లించే తూమును గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టడంతో సమస్య జటిలంగా మారింది. మూడు నెలలుగా కాల్వ ద్వారా సాగునీటిని విడుదల చేస్తున్నా సమీప చెరువులకు సైతం నీరు చేరకపోవడం ఏమిటని రైతన్నలు ప్రశ్నిస్తున్నారు. 32.5 కి.మీ. పొడవునా ఉన్న కాల్వ వెంట అడుగుకో పంపుసెట్ ఏర్పాటు చేసుకుని పొలాలకు సాగునీటిని మళ్లించుకుని వెళ్తున్నా అరికట్టే వారే కరువయ్యారని రైతులు ఆవేదన చెందుతున్నారు.
భూత్పురు రిజర్వాయర్ చివరి ఆయకట్టుకు అందని సాగునీరు
ఎగువన ఎడమ కాల్వ
తూముల షట్టర్ల ధ్వంసం
మూడు నెలలుగా నీరు పారుతున్నా నిండని చెరువులు
అమరచింత, పిన్నంచర్ల రైతులకు తప్పని సాగునీటి కష్టాలు


