అచ్చంపేట: నల్లమల గిత్తగా పేరొందిన తూర్పు పొడ జాతి పశువులకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఒంగోలు గిత్తకు ప్రత్యేక గుర్తింపు ఉండగా.. తెలంగాణలో నల్లమల ప్రాంతంలోని మన్ననూర్ గిత్తకు ప్రత్యేక హోదాకు నోచుకోలేకపోతోంది. రాష్ట్రానికి గర్వకారణమైన ఈ జాతికి అరుదైన గౌరవం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రాంత పశువుకు గౌరవం కల్పించేందుకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ 2025 మే నెలలో అమ్రాబాద్ మండలం మాచారం వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి సైతం తీసుకెళ్లారు.
లోతట్టు అభయారణ్యంలో..
నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలోని చెంచుపెంటల్లో ఉండే మేలురకం పొడ జాతి పశువులకు వందేళ్లకుపైగా చరిత్ర ఉంది. అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని మద్దిమడుగు, ఇప్పలపల్లి, మారడుగు, ఉడిమిళ్ల, చిట్లంకుంట, వంకేశ్వరం, పదర, లక్ష్మాపూర్, తిర్మలాపూర్, ఉప్పునుంతల, మాధవానిపల్లి, అమ్రాబాద్, మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట గ్రామాలతోపాటు మల్లాపూర్, అప్పాపూర్, ఈర్లపెంట, మేడిమొల్కల, ఆగర్లపెంట, పుల్లాయిపల్లి, సంగండిగుండాలు చెంచుపెంటల్లో ఈ పశుజాతి ఉంది. ఈ గ్రామాల రైతులు వ్యవసాయంతోపాటు పశుపోషణ ప్రధాన వృత్తిగా ఎంచుకుని పనిచేస్తున్నారు.
కోడె దూడలకు డిమాండ్
వ్యవసాయ అనుబంధమైన పశు పోషణలో ఈ ప్రాంత రైతులు ప్రగతి సాధిస్తున్నారు. నల్లమల తూర్పు పశు సంపదకు తెలంగాణతోపాటు ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక రాష్ట్రంలో మంచి డిమాండ్ ఉంది. కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్, రాయచూర్‌తోపాటు కోస్గి, కొడంగల్ రైతులు దశాబ్దాల కాలంగా మేలుజాతి కోడెలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారులు ఈ ప్రాంతంలో ఉంటూ పశువులను పరిశీలించి నచ్చిన వాటిని కొనుగోలు చేసేవారు. ప్రతిఏటా దీపావళి తర్వాత జరిగే కురుమూర్తి జాతరలోనూ నల్లమల పశువులను అమ్ముతారు. అటవీ ప్రాంతంలో రాళ్లు, రప్పలు, ఎత్తైన గుట్టలు, లోయ ప్రాంతంలోనూ నడిచే శక్తి ఉంటుంది. కాళ్ల గిట్టలు గుర్రం గిట్టలను పోలి బలంగా ఉండటంతో బాగా నడుస్తాయి. అటవీ మేతతో దృఢంగా ఉండడం, 20– 25 ఏళ్లపాటు వ్యవసాయ పనులు చేసే సామర్థ్యం కలిగి ఉండటం వల్ల వీటిపై ఆసక్తి చూపుతారు. రోగ నిరోధక శక్తి కలిగి ఉండి పాలు సైతం బాగా ఇస్తాయి.
తెలంగాణ బ్రాండ్‌గా తూర్పు పొడ జాతి పశువులు
లోతట్టు ప్రాంతంలో మేలురకం పశు సంపద
అమ్రాబాద్ గిత్తకు వందేళ్లకుపైగా చరిత్ర
500 మంది రైతులు.. 20 వేల పశువుల పెంపకం
2020లో ప్రత్యేక పశువుగా గుర్తింపు
రాష్ట్ర ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం కోసం ఎదురుచూపు


