అలంపూర్: అలంపూర్ క్షేత్రానికి యునెస్కో గుర్తింపు కల్పించాలని సీనియర్ సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మోహన్‌రావు కోరారు. ఈ మేరకు ఆదివారం నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలంపూర్‌లోని పురాతన ఆలయాల సముదాయం గత చరిత్ర, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ ప్రాంతానికి యునెస్కో గుర్తింపు లభిస్తే.. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల రాక పెరగడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని తెలిపారు. అదే విధంగా అలంపూర్ క్షేత్రంలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. ముఖ్యంగా భక్తులకు రవాణా సౌకర్యం మెరుగుపర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ప్రసాద్ స్కీం భవనంలో భక్తులకు అన్నప్రసాద సత్రం, వసతి గృహాల్లో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.
కార్మిక చట్టాల సవరణతో అసమానతలు
గద్వాల/ధరూరు: కార్మిక చట్టాల సవరణతో సామాజిక, ఆర్థిక అసమానతలు పెరిగి.. సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమవుతుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేరు నర్సింహ అన్నారు. జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో స్వీపర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం జిల్లా కేంద్రంలో జైల్‌భరో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వీపర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అంతకుముందు ధరూరులో జైల్‌భరోకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లతో పేదలు మరింత పేదలుగా, ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతారన్నారు. ఇది సమాజంలో అశాంతికి, కులాధిపత్య ధోరణికి దారితీస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహులు, దేవదాసు, మోష, తిమ్మప్ప పాల్గొన్నారు.
భూ నిర్వాసితులకు అండగా ఉంటాం
మదనాపురం: రైల్వేలైన్ విస్తరణలో భూములు కోల్పోయిన ప్రతి రైతుకు ప్రభుత్వాలు అండగా నిలుస్తాయని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి తెలిపారు. మండల కేందరంతో పాటు మండలంలోని కొన్నూరు, నర్సింగాపురం, ద్వారకనగర్ గ్రామాల్లో మొత్తం 125 మంది రైతులు రైల్వే లైన్ విస్తరణలో భూములు కోల్పోగా.. ఆదివారం కొన్నూరులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వారికి రూ.3,73,91,502 నష్ట పరిహారం చెక్కులను అందజేసి మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణానికి, ప్రాంతీయ అభివృద్ధికి భూములు త్యాగం చేసిన రైతుల రుణం తీర్చుకోలేనిదని కొనియాడారు. భూమి కోల్పోయిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా తగిన పరిహారం చెల్లించడమే లక్ష్యంగా పనిచేస్తు న్నామని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ రసూల్‌బీ, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ..
కొత్తకోట: పట్టణంలోని బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను ఆదివారం దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, కిచెన్, పరిసరాల్లో స్వచ్ఛతను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వసతులు, సమస్యలు, భోజన నాణ్యత ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనం, మెరుగైన వసతులు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. బాలికల విద్య, సంక్షేమం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం కొత్తకోటలో నిర్మాణంలో ఉన్న ప్రధాన డ్రైనేజీని పరిశీలించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను, అధికారులను కోరారు.


