విద్యార్థుల భవిష్యత్‌కు ‘పదో తరగతి’ కీలకం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల భవిష్యత్‌కు ‘పదో తరగతి’ కీలకం

Mar 6 2026 8:25 AM | Updated on Mar 6 2026 8:25 AM

గద్వాల: విద్యార్థుల భవిష్యత్‌కు పదో తరగతి ఎంతో ముఖ్యమైనదని, ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ఇదొక కీలక దశ అని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పదో తరగతి విద్యార్థులకు వివిధ సబ్జెక్టుల నిపుణులతో నిర్వహించిన జూమ్‌ మీటింగ్‌ ద్వారా అవగాహన కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు ప్రీఫైనల్‌ పరీక్షలో వచ్చిన మార్కులను పరిశీలించగా అధిక శాతం గణితం, హిందీ, తెలుగు సబ్జెకులలో తక్కువ మార్కులు వచ్చాయన్నారు. అలాగే ఆయా సబ్జెక్టులలో విద్యార్థులకు వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకుని ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించడం జరిగిందన్నారు. ఈ నెల 14 నుంచి 10వ తరగతి వార్షిక పరీక్షలు మొదలు కానుండటంతో ప్రధానంగా సీ, డీ కేటగిరిలలో ఉన్న విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల నుంచి అడిగే ముఖ్యమైన అంశాలను తెలియజేసేందుకు నిపుణులచే అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. పరీక్షలకు చాలా తక్కువ సమయం ఉండడంతో సాధ్యమైనంత వేగంగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. గతేడాది 2024– 25 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 26వ స్థానం, 2023– 2024 విద్యా సంవత్సరంలో 31 స్థానంలో ఉందన్నారు. ఈసారి మన జిల్లా కనీసం టాప్‌–15లో ఉండేలా ఫలితాలు రావాలంటే ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతి పరీక్షకు నాలుగైదు రోజులు ఖాళీ ఉండడంతో ఆ సమయంలో వివిధ సబ్జెక్టులోని ముఖ్యమైన ప్రశ్నల గురించి విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులు కూడా తప్పనిసరిగా పరీక్షల మధ్యన వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని శ్రద్ధగా సాధన చేయాలన్నారు. అలాగే ఒత్తిడి, భయాన్ని వీడి ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలన్నారు. ఇందుకోసం ధ్యానం చేయాలని, పరీక్షలు ముగిసే వరకు సెల్‌ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలని, మంచి పౌష్టికాహారం తీసుకోవాలని, తగినంత నిద్రపోవాలని సూచించారు. సమావేశంలో డీఈఓ విజయలక్ష్మి, డీపీఓ శ్రీకాంత్‌, సెక్టోరియల్‌ అధికారి మైఖేల్‌, ఆయా సబ్జెక్టు నిపుణులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement