మానవపాడు: ఏపీలోని గుంటూరు లీలగాయత్రి కోల్డ్ స్టోరేజ్‌లో మండల కేంద్రానికి చెందిన రైతులు నిల్వ ఉంచిన మిర్చి బస్తాలు మాయం చేయడంపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ స్వామి తెలిపారు. స్థానిక రైతులు సాయిబాబ, నాగశేషి, బజారి, రాముడు, విజయ్, నాగరాజు, రమేష్ 2023 సంవత్సరంలో సూపర్–10 రకం మిర్చి 1,357 బస్తాలు లీలగాయత్రి కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచగా.. రైతుల ప్రమేయం లేకుండా సదరు యాజమాన్యం శివరామకృష్ణ, ఏజెంట్ వెంకటేశ్వర్లు మిర్చిని అమ్ముకున్నారు. ఈ ఘటనపై ‘సాక్షి’లో ‘దాచుకుంటే.. దోచుకున్నారు!’ శీర్షికన మంగళవారం కథనం ప్రచురితమైంది. ఈ మేరకు స్పందించిన అధికారులు ఈ ఘటనపై చర్యలు తీసుకున్నారు. మోసపోయిన రైతులు గురువారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కోల్డ్ స్టోరేజీ యజమాని శివరామకృష్ణ, ఏజెంట్ వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


