నిద్దరోతున్న నిఘా.. | - | Sakshi
Sakshi News home page

నిద్దరోతున్న నిఘా..

Mar 7 2026 7:32 AM | Updated on Mar 7 2026 7:32 AM

జిల్లాలో యథేచ్ఛగా రేషన్‌ బియ్యం తరలింపు

డీలర్లు.. వ్యాపారులే మాఫియాగా దందా

మామూళ్ల మత్తులో తూగుతున్న సివిల్‌ సప్లయ్‌ శాఖ?

అడపాదడపా పోలీసుల తనిఖీల్లో పట్టివేత

గతేడాది 985.8 క్వింటాళ్ల బియ్యం సీజ్‌

గద్వాల క్రైం: పేదోడి బియ్యంపై అక్రమార్కులు పెత్తనం చెలాయిస్తున్నారు. నెలనెలా చౌకధర దుకాణాల నుంచి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచితంగా సరఫరా చేస్తుంది. అయితే డీల్లరు, వ్యాపారులే మాఫియాగా మారి లబ్ధిదారులకు కిలో రూ.12 చొప్పున చెల్లించి.. వ్యాపారులకు రూ.20కి విక్రయించి.. అక్కడి నుంచి బయటి రాష్ట్రాలకు రూ.30 చొప్పున యథేచ్ఛగా తరలిస్తున్నారు. అయితే దీనిని ఆదిలోనే నిలువరించాల్సిన సివిల్‌ సప్లయ్‌ శాఖలోని కొందరు అక్రమార్కులు మామూళ్లకు తలొగ్గి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అయితే సరిహద్దు ప్రాంతాల్లో పోలీసు శాఖ చేపడుతున్న తనిఖీల్లో అడపాదడపా అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టుబడుతోంది. జిల్లాలో గతేడాది 985.8 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం సీజ్‌ చేయగా.. ఈ సంవత్సరం 70 క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్నారు.

రెండు రాష్ట్రాల సరిహద్దు..

గద్వాల జిల్లాలో నిత్యం వందల క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పోలీసుల తనిఖీలో పట్టుబడుతున్నాయి. అయితే మాఫియా చేతుల్లో ఎన్ని వందల క్వింటాళ్ల రేషన్‌ బియ్యం రాష్ట్రాలు దాటి బయటి మార్కెట్‌లో విక్రయాలు జరుగుతున్నాయో చెప్పలేని దుస్థితి ఉంది. రెండు రాష్ట్రాల సరిహద్దు కావడంతో ఇక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన వ్యాపారులు సైతం ఇదే రూట్‌లో అధికారుల కళ్లకు గంతలు కట్టి తరలిస్తున్నారు. సివిల్‌ సప్లయ్‌, ఎన్‌ఫోర్సుమెంట్‌ విఫలమైతే విజిలెన్స్‌ అధికారులు ఏం చేస్తున్నారనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. ప్రతినెలా మాఫియా ఆయా శాఖల అధికారులకు మామూళ్లు ఇస్తుండటంతో చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే పోలీసుల తనిఖీలో పట్టుబడితే తప్ప రేషన్‌ బియ్యం మాఫియాను కట్టడి చేయడం లేదు. పూర్తిస్థాయిలో విచారణకు పోలీసు యంత్రాంగం అడుగులు వేస్తే మాఫియాను నిలువరించేందుకు దోహదం పడుతుంది. గతంలో పలువురు రైస్‌ మిల్లర్లు పెద్దఎత్తున్న అక్రమంగా బియ్యం తరలిస్తున్నట్లు పోలీసులకు తెలియడంతో పలు మిల్లులు సీజ్‌ అయిన సంఘటనలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో డీటీ స్థాయి అధికారులు సస్పెండ్‌ అయ్యారు. ప్రస్తుతం జిల్లాలో అక్రమార్కులు వివిధ రూట్లలో వ్యాపారం చేస్తూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement