గద్వాల క్రైం: తమ హక్కులను గుర్తించి మహిళా సమానత్వం, సాధికారత, సామాజిక మార్పుతోనే ప్రతి మహిళా అన్నిరంగాల్లో విజయం సాధిస్తుందని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో మహిళా సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోలీసు శాఖలో మహిళా సిబ్బంది కోసం మరిన్ని సంస్కరణలు అవసరమన్నారు. ఇంటా, బయటా మహిళలు ఎదుర్కొనే సమస్యలు, మహిళల పునరుత్పత్తి హక్కులు, మహిళలపై లైంగిక దాడి లాంటి సమస్యల వలయంలో ఎందరో చిక్కుకున్నారని, ఇలాంటి వాటిపై ప్రతిఒక్కరు చైతన్యం కావాలని కోరారు. ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం నిర్వహించడం కంటే ప్రతిక్షణం లింగ వివక్ష లేకుండా అందరూ సమానమేనని గుర్తిస్తే ఎంతో బాగుంటుందన్నారు. మారుతున్న కాలానుగుణంగా సామాజిక మార్పుతో విజయాలు సాధిస్తామన్నారు. జిల్లాలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోలీసు శాఖ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసిందన్నారు. అనంతరం కేక్ కట్ చేసి పలు విషయాలపై సలహాలు అందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, సీఐలు, ఎస్‌ఐలు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.


