భూపాలపల్లి అర్బన్: ప్రస్తుత ప్రభుత్వం ప్రచారానికి కాకుండా అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. జిల్లాల ఏర్పాటు చేసి పదేళ్లు అవుతున్న సందర్భంగా బీఆర్‌ఎస్ నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులకు పుష్ప గుచ్చాలు అందిస్తూ స్వీట్లను పంపిణి చేశారు. కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులను, మెడికల్ కాలేజీ సిబ్బంది, విద్యార్థులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రమణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని గండ్ర కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు.


