భూపాపల్లి అర్బన్: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 9న భూపాలపల్లిలోని పుష్ప గ్రాండ్ ప్రాంగణంలో భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 300లకుపైగా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల యువత కోసం ఆర్టీఓ ఆధ్వర్యంలో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. మేళా ప్రాంగణంలో రిజిస్ట్రేషన్ కౌంటర్లు, ఇంటర్వ్యూ హాళ్లు, తాగునీరు, నీడ, పారిశుద్ధ్య సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అర్హత కలిగిన యువత విద్యార్హతల ధ్రువపత్రాలు, అవసరమైన సర్టిఫికెట్లతో ఈ మేళాకు హాజరై అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
విద్యార్థినుల
భద్రతే షీ టీం లక్ష్యం
భూపాలపల్లి అర్బన్: విద్యార్థినులు మహిళలు, బాలికల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని షీ టీమ్ ఎస్సై స్వప్నకుమారి తెలిపారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు షీ టీం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాకేంద్రంలోని కేజీబీవీ, కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు మహిళల భద్రత, సైబర్ నేరాలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. షీ టీం ఎస్సై స్వప్నకుమారి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయాలు పెంచుకోవద్దన్నారు. వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్పద లింకులు, క్యూఆర్ కోడ్‌లు, ఏపీకే ఫైళ్లను క్లిక్ చేయవద్దన్నారు. వేధింపులు ఎదురైతే భయపడకుండా షీ టీం 87126 58162, అత్యవసరానికి 112, సైబర్ నేరాలకు 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రయాణ సమయంలో టీ–సేఫ్ యాప్‌ను వినియోగించాలని తెలిపారు.
‘ఇడుపు కాయితం’ షూటింగ్
మొగుళ్లపల్లి: మండలకేంద్రంలోని పెద్దవాగు బ్రిడ్జిపై, సమ్మక్క–సారక్క జాతర ప్రాంగణ ఆవరణలో ‘ఇడుపు కాయితం’ సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రకృతి అందాలు, వాగు పరిసరాలను దృష్టిలో ఉంచుకుని చిత్రబృందం చిత్రీకరణ చేపట్టింది. షూటింగ్ ప్రారంభమైన విషయం తెలుసుకున్న స్థానికులు ఆసక్తిగా అక్కడికి చేరుకున్నారు. ఈ చిత్రంలో ప్రియదర్శి కథానాయకుడిగా, నాగదర్గ హీరోయిన్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
విదేశీ విద్యానిధి
దరఖాస్తుల గడువుపెంపు
భూపాలపల్లి రూరల్: మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తుల గడువును అక్టోబర్ 15వరకు పొడిగించినట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి ఇందిర మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విదేశాల్లో మాస్టర్స్, డాక్టరేట్ కోర్సులు చదవాలనుకునే అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


