భూపాలపల్లి అర్బన్: నిమజ్జనం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం రద్దీగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు జిల్లాలోని నలుమూలల నుంచి వినాయక విగ్రహాలను అధిక సంఖ్యలో కాళేశ్వరంలోని గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు భూపాలపల్లి పట్టణం మీదగా తరలించారు. జిల్లాలో సుమారు వెయ్యికి పైగా విగ్రహాలను వినాయక మండళ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు పోలీసుశాఖ ధ్రువీకరించింది. కాగా, నిమజ్జనం సందర్భంగా కాళేశ్వరంతో పాటు ములుగు జిల్లాలోని లక్నవరం, ఏటూరునాగారం, ఇతర ప్రదేశాలకు విగ్రహాలను డప్పు వాయిద్యాల మధ్య తరలించారు. పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా డీఎస్పీ ఆధ్వర్యంలో భద్రత ఏర్పాట్లు చేయగా జిల్లా ఎస్పీ సంకీర్త్ పరిశీలించారు.


