● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను చట్టబద్ధంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ రెవెన్యూ అధికారులకు సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో భూ సేకరణలో భూసేకరణ చట్టాలు, నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులు, న్యాయస్థానాల తీర్పులపై రెవెన్యూ అధికారులకు, సిబ్బందికి హెచ్‌ఎండీఏ, టీసీఐఐసీలో ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్న మనోహర్‌తో కలిసి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ జిల్లాలో ఇరిగేషన్, సింగరేణి, జెన్‌కో, జాతీయ రహదారులు తదితర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భూసేకరణ జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో భూ సేకరణ జరిగిందని, అర్హులైన రైతులకు చట్టప్రకారం పరిహారం, పునరావాసం, పునరావాస ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూ సేకరణలో రైతుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ జాప్యానికి తావులేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఓఎస్డీ మనోహర్ మాట్లాడుతూ.. అర్హులైన ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మ, ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, ఏఓ శ్రీనివాసులు, అన్ని మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


