భూపాలపల్లి అర్బన్: సింగరేణి ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఉద్యోగులు, నర్సింగ్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్‌టీయూసీ) మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు శేషరత్నం తెలిపారు. స్థానిక సింగరేణి ఏరియా ఆస్పత్రిలో పిట్ సెక్రటరీ మహబూబి అధ్యక్షతన గురువారం ఏరియా ఆస్పత్రిలో ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శేషరత్నం మాట్లాడుతూ.. ఇటీవల శాసనసభలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సింగరేణి కార్మికుల సమస్యలను ప్రస్తావించిన అంశాలను వివరించారు. నర్సింగ్ సిబ్బంది డిజిగ్నేషన్ మార్పు కోసం కూడా ఐఎన్‌టీయూసీ కృషి చేస్తోందన్నారు. ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధనకు సంఘం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు జోగ బుచ్చయ్య, జనరల్ సెక్రటరీ పసునూటి రాజేందర్, మహిళా నాయకురాలు లలితశ్రీ, ఏరియా ఆస్పత్రి ఉద్యోగులు, నర్సింగ్ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.


