మల్హర్ (కాటారం): అడవుల సంరక్షణే ధ్యేయంగా అటవీ శాఖ అధికారులు పనిచేయాలని కాళేశ్వరం జోన్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ ప్రభాకర్ పిలుపునిచ్చారు. చింతకాని రేంజ్ పరిధిలోని సహజ అటవీ ప్రాంతంలో ఆయన బుధవారం పర్యటించారు. అధికారులతో కలిసి అడవి మొత్తం కలియతిరిగి, అక్కడ సహజంగా పెరిగిన చెట్ల జాతులు, అటవీ విస్తీర్ణం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అడవుల సంరక్షణపై అధికారులకు ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. అడవులను పెంపొందించడానికి ప్రత్యేక కృషి చేయాలని చెప్పారు. అటవీ సంరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, ఖాళీగా ఉన్న అటవీ భూముల్లో వివిధ రకాల మొక్కలు నాటి నూతన అడవులను అభివృద్ధి చేయాలని సూచించారు. అటవీ ప్రాంతంలో అక్రమంగా చెట్లను నరికే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రానున్న తరాలకు మొక్కలే ఆస్తి అని, అటవీ సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో భూపాలపల్లి డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్, ఎఫ్‌డీఓ సందీప్ రెడ్డి, కాటారం రేంజర్ స్వాతి, డిప్యూటీ రేంజర్ సురేందర్, బీట్ అధికారులు పాల్గొన్నారు.
కాళేశ్వరం సీసీఎఫ్ ప్రభాకర్


