భూపాలపల్లి అర్బన్: తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చేందుకు బుధవారం నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్, కలెక్టర్ క్యాంపు కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన గణనాథులకు అధి కారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం గణనాథుడి విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో నిమజ్జనానికి తరలించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశోక్‌కుమార్, ఇన్‌చార్జ్ అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.
మత సామరస్యానికి ప్రతీక
మహాముత్తారం: గణపతి నవరాత్రోత్సవాల వేళ మండలంలోని కనుకునూరు గ్రామంలో మతసామరస్యం వెల్లివిరిసింది. గ్రామంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయక మండపం వద్ద బుధవారం నిర్వహించిన లడ్డూ ప్రసాద వేలంపాటలో గ్రామానికి చెందిన ముస్లిం వ్యక్తి మహ్మద్‌పాషా పాల్గొని రూ.3,516కు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నాడు.
అన్నదానంలో
స్టీల్ ప్లేట్ల వినియోగం
కాళేశ్వరం: స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాలు –2026లో భాగంగా మండల కేంద్రంలోని టస్సార్ కాలనీలోని గణపతి నవరాత్రి అన్నదాన కార్యక్రమంలో మహదేవపూర్ ప్లేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లేట్లను వినియోగించారు. ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా స్టీల్ ప్లేట్లలో భక్తులకు భోజనం వడ్డించి ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించేలా బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ హసీనా భాను మాట్లాడుతూ మహాదేవపూర్‌ను ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ప్లేట్ బ్యాంక్ నిర్వాహకులు ప్రభాకర్‌రెడ్డి, మడక మధు మాట్లాడుతూ ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగంతో కలిగే అనారోగ్య సమస్యలను వివరించారు. అనంతరం ప్లాస్టిక్ నిషేధ ప్రతిజ్ఞ చేయించారు.
గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
మల్హర్ (కాటారం): ములుగు, జయశంకర్ జిల్లాల సమన్వయ అధికారి పద్మిని ఆదేశాల మేరకు మండలంలోని కాటారం స్థానిక గిరిజన గురుకుల బాలుర కళాశాలలో 2026–27వ విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సోమోజీ బుధవారం ఓక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 22 సీట్లు, బైపీసీ గ్రూపులో 16 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. 10వ తరగతి పూర్తి చేసిన గిరిజన విద్యార్థులు ఈనెల 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే, 5వ తరగతిలో 40 సీట్లు, 7వ తరగతిలో ఖాళీగా ఉన్న 5 సీట్లకు అర్హులైన గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 94909 57308 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
సీకేఎంలో పని చేయని పసికందుల పరికరాలు
కాశిబుగ్గ: వరంగల్‌లోని సీకేఎం ప్రసూతి వైద్యశాలలో పసికందులకు ఉపయోగించే పరికరాలు పనిచేయడం లేదని తెలుస్తోంది. నెలలోపు పసికందులు అనారోగ్యంతో బాధపడుతున్న తక్షణమే వైద్యసేవలు అందించాల్సిన పరికరాల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇన్ బర్న్ వార్డులో ఆక్సిజన్ సమస్య, తక్కువ బరువు, శ్వాస అందని పరిస్థితిలో పసికందులకు సీ ప్యాప్ ద్వారా వైద్యసేవలు అందిస్తారు. ఈ పరికరం పనిచేయడం లేదని సమాచారం. అదేవిధంగా అవుట్ బర్న్‌లో కూడా పసికందులకు అవసరమైన రెండు ఫొటోథెరపీలు ఉండగా ఇందులో ఒకటి పనిచేయడం లేదని తెలిసింది. దీంతో జాండీస్ వచ్చిన పసికందుల వైద్యసేవలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం. ఇటీవల ఆదిలాబాద్ రిమ్స్‌లో షార్ట్ సర్యూట్ వల్ల ఐదుగురు చిన్నారులు మృతిచెందినా సీకేఎం అధికారులు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


