● అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్
భూపాలపల్లి: ఖరీఫ్ 2026–27 సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్నామని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, సంచాలకుడు గోపి, మార్కెటింగ్ శాఖ సంచాలకుడు రాహుల్‌రాజ్ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఐడీఓసీ నుంచి అడిషనల్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికారులు పలు సూచనలు, సలహాలు అందించిన అనంతరం, జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 170 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముంపునకు గురయ్యే అవకాశమున్న 12 కొనుగోలు కేంద్రాలకు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించాలని, ధాన్యం నిల్వకు ఫంక్షన్‌హాళ్లు, ప్రైవేట్ గోదాములు, సీఏపీ స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. సుమారు 37.60 లక్షల గోనె సంచులు అవసరమవుతున్నందున వాటిని ముందుగానే సమకూర్చుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఏఓ బాబురావు, డీసీఎస్‌ఓ కిరణ్‌కుమార్, డీఎం రాములు, అధికారులు పాల్గొన్నారు.


