మల్హర్ (కాటారం): కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమలవుతున్న జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (ఎన్‌ఏల్‌ఈపీ) పనితీరును పరిశీలించేందుకు కేంద్ర, రాష్ట్ర స్థాయి బృందాలు పీహెచ్‌సీని బుధవారం సందర్శించాయి. పీహెచ్‌సీ పరిధిలో చేపడుతున్న కుష్ఠు వ్యాధి గుర్తింపు, చికిత్స, ఫాలోఅప్, రికార్డుల నిర్వహణ, అవగాహన కార్యక్రమాలపై సిబ్బందితో కేంద్ర పరిశీలకుడు, చెంగల్పట్టు సెంట్రల్ లెప్రసీ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ వీరకుమారన్, రాష్ట్ర లెప్రసీ బృందం సభ్యులు డాక్టర్ నాగరాజు, వెంకటేశ్వర రావు, జిల్లా లెప్రసీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సందీప్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఏల్‌ఈపీ రికార్డులను అధికారులకు పీహెచ్‌సీ వైద్యాధికారులు మౌనిక, హారిక సమర్పించారు. అనంతరం, డాక్టర్ వీరకుమారన్ మాట్లాడుతూ కుష్ఠు వ్యాధిని తొలిదశలోనే గుర్తించి చికిత్స అందించాలని సూచించారు. వ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు అవగాహన కల్పించాలని చెప్పారు. వ్యాధి నిర్మూలనకు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో పీఎంఓలు మల్లయ్య, భోజనాయక్, హెల్త్ అసిస్టెంట్లు రాజు, పరమేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.


