భూపాలపల్లి అర్బన్: కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశం, బిల్డింగ్ వర్కర్స్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రవీణ్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ తెలిపారు. జిల్లాకేంద్రంలో ఆలిండియా ట్రేడ్ యూనియన్ (ఏఐటీయూసీ) నాల్గవ జిల్లా మహాసభ ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మోటపలుకుల రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభకు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశం, బిల్డింగ్ వర్కర్స్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రవీణ్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొరిమి రాజ్‌కుమార్ ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లుగా అమలు చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ కోడ్‌లు కార్మికుల హక్కులను హరించే విధంగా ఉన్నాయన్నారు. ఎనిమిది గంటల పనిదినాన్ని 12 గంటలకు పెంచడం, సమ్మె హక్కును పరిమితం చేసే చట్టాలు తీసుకురావడం అన్యాయమన్నారు. 1920లో స్థాపించబడిన ఏఐటీయూసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతున్న సంఘమని, కార్మికులంతా ఐక్యంగా ఉద్యమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో జెన్‌కో, ఆర్టీసీ, మున్సిపల్, గ్రామపంచాయతీ, బిల్డింగ్ నిర్మాణ రంగం, మధ్యాహ్న భోజన పథకం, సింగరేణి, కాంట్రాక్ట్ కార్మికులు, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, హమాలీలు, సివిల్ సప్లై హమాలీలతో పాటు వివిధ రంగాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహాసభలో మొత్తం 14 తీర్మానాలను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి క్యాతరాజు సతీష్, నాయకులు వెంకటేష్, తాళ్ల పోశం, శీను, సుగుణ, సీపీఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్, జిల్లా సమితి సభ్యులు శ్రీకాంత్, జోసెఫ్, గులాం నబీ పాల్గొన్నారు.


