భూపాలపల్లి: ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో ఎస్‌ఐఆర్ నమోదు 14 శాతానికి, ఇతర మండలాల్లో సుమారు 50 శాతానికే పరిమితమైందని అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ 10 శాతం కంటే తక్కువ నమోదు చేసిన బీఎల్‌ఓలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల పురోగతిని నిశితంగా సమీక్షిస్తోందని అన్నారు. ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజలకు ఎస్‌ఐఆర్ ఫారాలు అందజేయడంతో పాటు వాటిని పూర్తి చేయించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పొరపాట్లు లేకుండా చేస్తున్నాం..
భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పొరపాట్లు లేకుండా చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న డిజిటలైజ్ ప్రక్రియపై భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ న్యూ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరిక


