భూపాలపల్లి అర్బన్: తాడిచర్ల ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ సింగరేణి భవిష్యత్‌కు కీలకంగా మారుతుందని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తిరెడ్డి, బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ తెలిపారు. తాడిచర్ల బొగ్గు బ్లాక్–2ను సింగరేణికి కేటాయించిన సందర్భంగా బుధవారం ఏరియాలోని పలు గనుల్లో కార్మికులకు స్వీట్లు పంచి బాణాసంచా పేల్చుతూ సంబరాలు నిర్వహించారు. ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్‌తో పాటు కార్యాలయ సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిశిధర్‌రెడ్డి, నాయకులు సంపత్, మధుసూదన్‌రెడ్డి, దొంగల రాజేందర్, వెలబోయిన సుజేందర్, గణపతి పాల్గొన్నారు.
పోరాటాలు కొనసాగించాలి
భూపాలపల్లి అర్బన్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పోరాటాలు కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య పిలుపునిచ్చారు. సంఘం జిల్లా ద్వితీయ మహాసభ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేసి నిరంతరంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని, పోడు, ఆక్రమిత ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న అర్హులైన పేదలకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లా కమిటీ ఎన్నిక
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పోలం రాజేందర్, ప్రధాన కార్యదర్శిగా బొడ్డు కిషోర్, ఉపాధ్యక్షులుగా బొడ్డు సునీత, కోడెం శంకర్, సహాయ కార్యదర్శులుగా జాడి మల్లేశ్వరి, వద్ది గోమాత, కోశాధికారిగా మామిడి రాధ ఎన్నికయ్యారు.
మెడికల్ బోర్డుపై ప్రకటన చేయాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో 16 నెలలుగా నిలిచిపోయిన మెడికల్ ఇన్వాలిడేషన్ బోర్డును ఎప్పుడు నిర్వహిస్తారో రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం అధికారికంగా ప్రకటించాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య డిమాండ్ చేశారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు కార్మికులకు అనేక హామీలు ఇచ్చిన కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రస్తుతం కార్మికుల హక్కుల విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మెడికల్ బోర్డు నిర్వహణపై ఇప్పటివరకు యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా, గుర్తింపు పొందిన సంఘాల నాయకులు ప్రకటనలు చేయడం, గతంలో కూడా ఇలాంటి హామీలు ఇవ్వడం వల్ల కార్మికుల్లో అయోమయం నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూఎస్ నాయకులు దాసరి జనార్దన్, కాసర్ల ప్రసాద్, రత్నం కిరణ్, నామాల శ్రీనివాస్, రాళ్లబండి బాబు, జయశంకర్, మధుకర్, లక్ష్మినారాయణ, రవి, మనోజ్, వెంకటేశ్ పాల్గొన్నారు.
హోంగార్డు కుటుంబానికి అండగా ఉంటాం
భూపాలపల్లి: భూపాలపల్లి పట్టణంలోని జవహర్‌నగర్ కాలనీలో నివాసం ఉంటూ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో హోంగార్డుగా పనిచేసే గోలి శ్రీనివాస్‌రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందాడు. ఎస్పీ సిరి శెట్టి సంకీర్త్ విషయం తెలుసుకొని శ్రీనివాస్ ఇంటికి వెళ్లి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలిపారు. శ్రీనివాస్ కుటుంబానికి పోలీసుశాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ వెల్లడించారు.


