కార్తెలు మారుతున్నా
కరుణించని వరుణుడు
భూపాలపల్లి రూరల్: దున్నిన దుక్కుల్లో విత్తులు పెట్టాల్సిన రైతులు వాన లేక నెల రోజులుగా ఆకాశంవైపు చూస్తున్నారు. రోహిణి కార్తె చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షం కురిపించకుండానే వెళ్లిపోయింది. మృగశిర కార్తె వచ్చినా వాన జాడే లేదు. ఆరుద్ర కార్తె కూడా వెళ్లిపోయింది. కానీ వర్షాలు మాత్రం అనుకున్న స్థాయిలో కురవడం లేదు. జూలై నెలలో కురిసే వానలపైనే రైతుల సాగు ఆధారపడి ఉంది.
2,16,734 ఎకరాల్లో పంటలు సాగు..
రైతులు విత్తనాలు, ఎరువులు సమకూర్చుకొని సాగుకు సమాయత్తమయ్యారు. ఈ సీజన్‌లో జిల్లాలో 2,16,734 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసినా... జూన్ ముగిసే నాటికి 1,06,560 ఎకరాల పత్తి సాగు అంచనాకు 45వేల ఎకరాల్లో పత్తి సాగు నమోదైంది. జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, కంది, జొన్న పంటలు సాగుచేస్తుంటారు. ఇందులో వరి పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. సీజన్‌లో 1,09,854 ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేయగా.. ఇప్పటివరకు 50వేల ఎకరాలకు పైగా నారుమడులు సిద్ధమయ్యాయి. అది ఎక్కువగా బోర్లు, భూగర్భజలాల ఆధారంగా రైతులు నార్లు పోసిన ప్రాంతాలే. తదుపరి వర్షాలు లేకపోతే అవి కూడా ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి సాగు కొంతమేర ఊరటనిచ్చే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో సగటు వర్షపాతం సాధారణస్థాయిలో నమోదైనప్పటికీ మండలాల వారీగా పరిస్థితి భిన్నంగా ఉంది. 8 మండలాల్లో జూన్ మాసంలో లోటువర్షపాతం కనిపించింది. జూలై మాసంలో కురిసే వర్షాలపైనే ఈ ఏడాది సాగు భవిష్యత్ ఆధారపడి ఉంది.
దుక్కులు దున్ని, దిక్కులు చూస్తున్న రైతులు
ఎండుతున్న నారుమడులు..
మొలకెత్తని వత్తి గింజలు
లక్ష్యానికి చాలా దూరంలో
పంటల సాగు విస్తీర్ణం
ఈ నెలలో కురిసే వర్షాలపైనే ఆశలు


