అభ్యంతరాల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

అభ్యంతరాల స్వీకరణ

Jul 8 2026 1:08 AM | Updated on Jul 8 2026 1:08 AM

భూపాలపల్లి అర్బన్‌: ఎన్‌హెచ్‌ఎంలో ల్యాబ్‌టెక్నీషియన్‌ పోస్టు నియామక ప్రొవిజనల్‌ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ చేపడుతున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి మధుసూదన్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితాను డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోని నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 9 సాయంత్రం 5గంటలలోపు తెలియజేయాలని సూచించారు.

రాష్ట్రస్థాయికి ఎంపిక

చిట్యాల: వికసిత్‌ భారత్‌లో భాగంగా కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్రా ప్రధాన్‌ నిర్వహించిన పోటీలలో మండలంలోని నైన్‌పాక జిల్లా పరిషత్‌ విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు పాఠశాల ఇన్‌చార్జ్‌ ప్రధానోపాధ్యాయులు ఎం.సుధాకర్‌ తెలిపారు. మంగళవారం శ్రీపతి వర్షిత్‌, శ్రీరామ్‌, కార్తిక్‌, శివకుమార్‌, గౌతమ్‌ రాష్ట్రస్థాయిలో ఎంపికై మొదటి స్థానంలో నిలిచారన్నారు. వీరిని అధ్యాపక బృందం సన్మానించింది.

చేపల వేట వద్దు..

గణపురం: మండలకేంద్రంలోని గణసముద్రం చెరువులో జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 31 వరకు చేపల వేట చేయొద్దొని జిల్లా మత్స్యశాఖ అధికారి వై.విజయ్‌కుమార్‌ తెలిపారు. వరదలు, చేపల వనరుల సంరక్షణ, చేప పిల్లల అభివృద్ధి, మత్స్య సంపద పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మత్స్యకార సహకార సంఘాలు, గ్రామస్తులు మత్స్య సంపద పెరుగుదలకు సహకరించాలన్నారు.

రాయితీలు సద్వినియోగం చేసుకోవాలి

భూపాలపల్లి రూరల్‌: ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి తిరుపతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం కింద కొత్త పండ్ల తోటల స్థాపన, నాణ్యమైన కూరగాయల నారు పంపిణీ, పూల తోటల పెంపకం పాతతోటల పునరుద్ధరణ, నీటి కుంటల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు లభిస్తాయని అన్నారు. ఈ పథకం ద్వారా రైతులు పండ్ల తోటలు, కూరగాయలు, పూలు సాగు చేసుకోవడానికి 40నుంచి 50శాతం వరకు రాయితీ పొందవచ్చని తెలిపారు.

జీపీల బలోపేతమే లక్ష్యం

ములుగు: గ్రామ పంచాయతీలను ఆర్థికంగా, పరిపాలనాపరంగా బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ధనసరి సీతక్క స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌ నుంచి గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలు, 16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, గ్రామాల్లో అభివృద్ది కార్యక్రమాలపై మంత్రి సీతక్క రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా నుంచి అదనపు కలెక్టర్‌ సంపత్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఖర్చు చేసే ప్రతీ రూపాయి ప్రజల అభ్యున్నతికే ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ వెంకయ్య, మిషన్‌ భగీరథ ఎస్‌ఈ చల్లారెడ్డి, ఈఈ సురేందర్‌, పంచాయతీరాజ్‌ ఈఈ అజయ్‌ కుమార్‌, మిషన్‌ భగీరథ డీఈ సునీత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

కందకాలు తవ్వితే ఉద్యమిస్తాం

ఏటూరునాగారం: ఏజెన్సీలోని గిరిజనులు సాగుచేసుకుంటున్న భూముల్లో అటవీశాఖ అధికారులు కందకాలు తీస్తే ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. ఐటీడీఏ కార్యాలయం ఎదుట సీపీఎం నాయకులు, రైతులు, గిరిజనులు మంగళవారం ధర్నా చేపట్టారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐటీడీఏ ఇన్‌చార్జ్‌ ఏపీఓ ప్రతాప్‌కు నాయకులు అందజేశారు. అనంతరం వెంకటరెడ్డి మాట్లాడుతూ మండలంలోని గంటలకుంట గ్రామానికి చెందిన గిరిజనులు 25 ఏళ్లుగా భూములు సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement