● కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు: జిల్లాలోని బొగత జలపాతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మంగళవారం బొగత జలపాతం వద్ద చేపట్టనున్న అభివృద్ధి పనులపై సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడారు. బొగత పరిసరాలను పర్యాటకులు ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. స్థానిక వంటకాలను పర్యాటకులకు అందుబాటులో ఉంచే విధంగా ఇందిరా మహిళా శక్తి ఫుడ్‌కోర్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కింగ్, విశ్రాంతి సౌకర్యాలు, భద్రత, దిశా నిర్ధేశక బోర్డులతో పాటు మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. స్థానిక మహిళా స్వయం సహాయక సంఘాలకు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధితో పాటు ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రతి పర్యాటకుడికి నాణ్యమైన సేవలు అందించాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, డీఎఫ్‌ఓ వికాస్ మీనా, టూరిజం అధికారి శివాజీ, అడిషనల్ డీఆర్‌డీఓ శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


