ఇసుక.. ఇష్టారాజ్యం! | - | Sakshi
Sakshi News home page

ఇసుక.. ఇష్టారాజ్యం!

Jul 4 2026 2:43 AM | Updated on Jul 4 2026 2:43 AM

కాగిత రహిత విధానం విస్తరణ

టేకుమట్ల మండలకేంద్రంలోని చలివాగు, రాఘవరెడ్డిపేట, ఆశిరెడ్డిపల్లి, సుబ్బక్కపల్లి, ఎంపేడు, బూర్నపల్లి, కలికోట గ్రామాల చలివాగు, మానేరు పరివాహక ప్రాంతాల నుంచి అక్రమార్కులు నిత్యం వందలాది ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు ఇష్టారీతిన తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లతో పాటు ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఉచితంగా ఇసుకను తీసుకెళ్లవచ్చని ఎమ్మెల్యే చెప్పిన మాట అక్రమార్కుల పాలిట వరంగా మారింది. పరకాల, ములుగు, హనుమకొండ ప్రాంతాలకు కూడా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఇసుకను తరలించే ట్రాక్టర్లకు అనుమతి పత్రాలను జారీచేస్తే సహజ సంపదను కాపాడినట్లు ఉంటుందని పలువురు అంటున్నారు. – టేకుమట్ల

పకడ్బందీగా

పారిశుద్ధ్య పనులు

రేగొండ: పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని పంచాయతీరాజ్‌, రూరల్‌ ఎంప్లాయిమెంట్‌ అడిషనల్‌ కమిషనర్‌ రవీందర్‌ అన్నారు. కొత్తపల్లిగోరి మండలంలోని చెన్నాపూర్‌ గ్రామాన్ని శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో రోడ్లపై చెత్తాచెదారం లేకుండా చూడాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా ఇళ్ల పరిసరాలలో, రోడ్డుపై నీరు నిల్వ లేకుండా చూడాలని చెప్పారు. నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్‌ బాల్స్‌ వేయాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వ నిబంధనల మేరకు ఖర్చు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, డీపీఓ లత, డీఆర్‌డీఓ బాలకృష్ణ, డివిజనల్‌ పంచాయతీ అధికారి మల్లిఖార్ఙునరెడ్డి, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో మీసేవ కేంద్రాల ద్వారా వివిధ ప్రభుత్వ సేవల కోసం దరఖాస్తు చేసుకునే ప్రజలకు కాగిత రహిత (పేపర్‌లెస్‌) సేవలను మరింత విస్తరించనున్నట్లు ఈడీఎం శ్రీకాంత్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో డీఆర్‌డీఓ బాలకృష్ణ, డీపీఎం రవితో కలిసి మీసేవ కేంద్రాల ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు మొబైల్‌ యాప్‌ ఆధారిత విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. నివాస, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ, ఆదాయం, ఈబీసీ, ఓబీసీ తదితర రెవెన్యూ శాఖ సేవల వెరిఫికేషన్‌ కోసం ఇకపై దరఖాస్తుదారులు భౌతిక పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. మొబైల్‌ యాప్‌ ద్వారా అధికారులు లాగిన్‌, పాస్‌వర్డ్‌లతో దరఖాస్తులను పరిశీలించి సర్టిఫికెట్లను జారీ చేయవచ్చని వివరించారు. ఈ విధానంతో తక్కువ సమయంలో ఎక్కువ దరఖాస్తులను పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చన్నారు. గతంలో ఆదాయ ధ్రువీకరణ పత్రాలకే పరిమితమైన ఈ విధానాన్ని ప్రస్తుతం రెవెన్యూ శాఖలోని అన్ని కేటగిరీల సేవలకు విస్తరించినట్లు తెలిపారు. మీసేవ కేంద్రాల నిర్వాహకులు ప్రజలను భౌతిక పత్రాల కోసం ఇబ్బంది పెట్టరాదని, ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను ఉల్లంఘిస్తే సంబంధిత అధికారులతో పాటు నిర్వాహకులపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఒకే దరఖాస్తుతో బహుళ కనెక్షన్లు

భూపాలపల్లి రూరల్‌: అపార్ట్‌మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాల కోసం బల్క్‌, మల్టిఫుల్‌ అప్లికేషన్స్‌ రిజిస్ట్రేషన్‌ విధానాన్ని అమలు చేస్తున్నట్లు భూపాలపల్లి సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ రమేష్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా విడివిడిగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఒకే భవనంలో అవసరమైన అన్ని విద్యుత్‌ కనెక్షన్ల కోసం నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement