భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతిరోజూ పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని ఇప్పటికే రాష్ట్రంలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రారంభించగా గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 18వేల మంది విద్యార్థులు, జూనియర్ కళాశాలల్లో 3వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. జిల్లాలో ఈ పథకం అమలుకు విద్యాశాఖ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పథకం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం వేడి పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించనున్నారు. దీంతో విద్యార్థుల హాజరు పెరగడంతో పాటు వారి ఆరోగ్యం, పోషకాహార స్థాయి మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థులకు ఇప్పటికే మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, ఇతర సంక్షేమ పథకాలు అందిస్తుండగా, ఇప్పుడు అల్పాహారం కూడా అందించనుండటం కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనంతో ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసే చర్యగా విద్యావర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
పెండింగ్ బిల్లులు విడుదల
2023–24 విద్యాసంవత్సరంలో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాఠశాలల్లో మండలానికి ఒకటి చొప్పున పైలెట్ ప్రాజెక్ట్‌గా అల్పాహారం ప్రారంభించింది. 2024లో జరిగిన ఎన్నికల అనంతరం బిల్లులు చెల్లించకపోవడంతో అల్పాహారం పథకం విద్యార్థులకు నిలిచిపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో పెండింగ్ బిల్లును చెల్లించేందుకు అంగీకరించడంతో జిల్లాకు రావాల్సిన రూ.3,14,740 విడుదల చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు.
ఉపాధ్యాయులకు సైతం అల్పాహారం
గతంలో పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనాన్ని ఉపాధ్యాయులు సైతం తినేవారు. కొద్ది రోజుల క్రితం ఉపాధ్యాయులు తినవద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మధ్యాహ్నం భోజనానికి ఉపాధ్యాయులు దూరంగా ఉంటున్నారు. ఉపాధ్యాయులు సైతం అల్పాహారం, మధ్యాహ్న భోజనం చేయడం వలన నాణ్యమైన అల్పాహారం, భోజనం విద్యార్థులకు అందించే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులకు వర్తింప చేయాలని సూచించింది.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అల్పాహారం
ప్రభుత్వం కీలక నిర్ణయం
జిల్లాలో 21వేల మంది విద్యార్థులకు ప్రయోజనం


