
శాస్త్ర పరిశోధనలకు ప్రోత్సాహం
జాతీయస్థాయిలో ‘విద్యార్థి విజ్ఞాన్ మంథన్’
ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి..
భూపాలపల్లి అర్బన్: విద్యార్థుల మెదడుకు పదునుపెట్టి భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. విద్యార్థి విజ్ఞాన్ మంథన్(వీవీఎం) పేరిట జాతీయస్థాయి సైన్స్ ప్రతిభా పరీక్షను ఏటా దేశవ్యాప్తంగా అక్టోబర్‌లో నిర్వహిస్తోంది. ఇందులో ప్రతిభచూపిన వారికి ఉపకార వేతనాలు ఇస్తోంది. ఆన్‌లైన్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 6–10 తరగతి, జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులు అర్హులు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
విజ్ఞాన్ మంథన్ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తున్నారు. అర్హులైన వారు పోటీల్లో పాల్గొనేందుకు సెప్టెంబర్ 30లోగా www.vvm. org. in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. యూజర్ ఐడీ పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి వివరాలు నమోదుచేయాలి. పరీక్ష రుసుము రూ.200 ఉంటుంది. ఈ నెల 16వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో పుస్తకాలు అందుబాటులో ఉంచారు.
పరీక్ష నిర్వహణ ఇలా..
పాఠశాల నుంచి పాల్గొనే 6–9 తరగతి విద్యార్థులను జూనియర్లుగా, పదో తరగతి, ఇంటర్ విద్యార్థులను సీనియర్లుగా పరిగణిస్తారు. విద్యార్థులు తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌తో పాటు ఇతర మాధ్యమాల్లో పరీక్ష రాయవచ్చు. 90 నిమిషాల్లో 100 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. గణితం, భౌతిక, రసాయన, జీవశాస్త్రాల నుంచి 50 శాతం, భారతదేశం కృషిపై 20 శాతం, శాస్త్రవేత్తల పరిశోధనలపై 20 శాతం, లాజికల్ రీజనింగ్‌పై 10 శాతం ప్రశ్నలు ఉంటాయి. జూనియర్ కేటగిరీ విద్యార్థులు అక్టోబరు 28 నుంచి నవంబరు 2 వరకు, సీనియర్ కేటగిరిలో నవంబర్ 19–23 వరకు వారి తరగతిని బట్టి వారికి నచ్చిన తేదీల్లో ఆన్‌లైన్‌లో పరీక్ష రాయవచ్చు. 2026 జనవరి 4న రాష్ట్ర స్థాయిలో, 30న జాతీయ స్థాయిలో పోటీలు ఉంటాయి.
6వ తరగతి నుంచి ఇంటర్ వరకు
విద్యార్థులు అర్హులు
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
సెప్టెంబర్ 30వ తేదీలోపు గడువు
పాఠశాల స్థాయిలో 18 మంది చొప్పున, జిల్లా స్థాయిలో సబ్జెక్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పాల్గొనే వారందరికీ ధ్రువపత్రాలు అందజేస్తారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభచూపిన తొలి ముగ్గురికి రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేలు బహుమతిగా అందజేస్తారు. జాతీయస్థాయిలో ప్రతిభ చూపిన మొదటి ముగ్గురు విద్యార్థులకు రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు అందజేస్తారు. దేశంలోని పరిశోధన, అభివృద్ధి సంస్థలను సందర్శించే అవకాశం కల్పిస్తారు. ఏడాది పాటు నెలకు రూ.2వేల చొప్పున స్కాలర్‌షిప్ అందిస్తారు.
ఉమ్మడి జిల్లాలోని విద్యార్థులు విద్యార్థి విజ్ఞాన్ మంథన్‌ను సద్వినియోగం చేసుకోవాలి. ఈ పరీక్ష ద్వారా వారిలో దాగి ఉన్న సామర్థ్యం బయటకు వస్తుంది. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో పాల్గొనడం వలన భవిష్యత్‌లో కూడా ఇటువంటి పరీక్షలపై భయం పోతుంది. ఈ పరీక్షకు సంబంధించిన పుస్తకాలు కూడా వెబ్‌సైట్‌లో ఉందుబాటులో ఉంటాయి. ప్రతిభ కనబర్చిన వారికి నగదు ప్రోత్సాహకాలు ఉంటాయి. ప్రతీ నెల స్కాలర్‌షిప్ అవకాశం ఉంటుంది. – బర్ల స్వామి, జిల్లా సైన్స్ అధికారి

శాస్త్ర పరిశోధనలకు ప్రోత్సాహం