జనగామ: ప్రధానమంత్రి ధన్‌ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) విజయవంతమైన అమలుకు ప్రతీ మండలం, గ్రామానికి ప్రత్యేకమైన సూక్ష్మ ప్రణాళిక (మైక్రో ప్లానింగ్) రూపొందించి, నిర్దేశించిన లక్ష్యాలను ఆరు సంవత్సరాల్లో సాధించేలా క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ, పీఎం ధన్‌ధాన్య కృషి యోజన కేంద్ర నోడల్ అధికారి బల్దేవ్ పురుషార్థ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, మత్స్య, నీటిపారుదల, మార్కెటింగ్ తదితర శాఖలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్యాచరణ వివరించాయి. నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, మార్కెట్ డి మాండ్‌కు అనుగుణంగా పంటల సాగు ఉండాలని, సహజ వనరులకు అనుగుణంగా వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని బల్దేవ్ పురుషార్థ సూచించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. తక్కువ వ్యవసాయ ఉత్పాదకత, పంటల సాంద్రత, వ్యవసాయ రుణాల ప్రవాహం వంటి ప్రమాణాల ఆధారంగా జనగామ జిల్లా పీఎం ధన్‌న్‌ధాన్య కృషి యోజనకు ఎంపికై ందన్నారు. వచ్చే ఆరు సంవత్సరాల్లో ఈ మూడు రంగాల్లో జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. జిల్లా లో 1.99 లక్షల మంది రైతుల్లో 1.55 లక్షల మంది రైతుల వివరాలు రైతు రిజిస్ట్రీలో నమోదయ్యాయని, 1,01,463 కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రూ.1,469 కోట్ల వ్యవసాయ రుణాలు అందుతున్నాయని తెలిపారు. అలాగే 8,624 మంది పాల ఉత్పత్తిదారులు రోజుకు 35,500 లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తున్నారని, 7,888 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు జరుగుతోందని వివరించారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో 62 మహిళా శక్తి రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి రాష్ట్రంలో తొలిసారిగా అమలు చేసిన జిల్లాగా జనగామ నిలిచిందని కలెక్టర్ పేర్కొన్నారు.
కలెక్టర్‌కు ప్రశంసలు
కలెక్టర్ రూపొందించిన ‘తెలంగాణ అగ్రికల్చర్ ఎమర్జెన్సీ అండ్ ఆల్టర్నేటివ్ యాక్షన్ ప్లాన్–వర్షాకాలం–2026’ పుస్తకాన్ని పరిశీలించిన బల్దేవ్ పురుషార్థ ప్రత్యేకంగా అభినందించారు. ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి రైతులకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అందించే ఈ ప్రయత్నం ఇతర జిల్లాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మహిళా రైతు సేవా కేంద్రాల పనితీరును ప్రశంసిస్తూ, వాటి అమలు విధానం, ఫలితాలను సమగ్రంగా డాక్యుమెంటేషన్ చేయాలని సూచించారు. సమీక్షలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోనీ, డీఆర్డీఓ భాస్కర్, ఏపీడీ నూరుద్దీన్, డీవీహెచ్‌ఓ మురళీధర్ రావు, మత్స్యశాఖ అధికారి రాణా ప్రతాప్, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రమ్య, సీపీఓ చినకోట్యానాయక్, ఎల్‌డీఎం ప్రతిభ, చేనేత, జౌళి శాఖ అధికారి బాబు, సర్వే అండ్ ల్యాండ్స్ ఏడీ మన్యంకొండ, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ సీతారాం, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
‘ధన్‌ధాన్య’ విజయవంతానికి
సమర్థవంతంగా పనిచేయాలి
ఆరేళ్లలో నిర్దేశించిన లక్ష్యాలు
చేరుకోవాలి
ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఇతర జిల్లాలకు ఆదర్శం
మహిళా రైతు సేవా కేంద్రాల
పనితీరు భేష్
కలెక్టర్‌కు పీఎండీడీకేవై కేంద్ర నోడల్ అధికారి బల్దేవ్ పురుషార్థ ప్రశంసలు


