వారాహిగా భద్రకాళి అమ్మవారు | - | Sakshi
Sakshi News home page

వారాహిగా భద్రకాళి అమ్మవారు

Jul 18 2026 3:41 AM | Updated on Jul 18 2026 3:41 AM

కుల్లా, నిత్యక్లిన్నా క్రమాల్లో పూజలు

హన్మకొండ కల్చరల్‌: భద్రకాళి ఆలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం అమ్మవారికి కుల్లా క్రమంలో, నిత్యక్లిన్నా క్రమంలో పూజలు జరిపి వారాహి అమ్మవారుగా అలంకరించారు. శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ఉదయం నుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, చతుఃస్థానార్చన, అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరానికి కుల్లా క్రమంలో పూజలు నిర్వహించి వారాహి అమ్మవారుగా అలంకరించారు. షోఢశీక్రమాన్ని అనుసరించి స్నపన మందిరంలోని బోగభేరాన్ని నిత్యక్లిన్నాగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ రాముల సునీత, సిబ్బంది పర్యవేక్షించారు.

చిల్పూరు ఆలయానికి

రెండు అర్చక పోస్టులు

చిల్పూరు: చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి దేవాలయానికి రెండు అర్చక పోస్టులు మంజూరు కాగా శుక్రవారం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో దేవాదాయ ముఖ్యకార్యదర్శి శైలజారామయ్యర్‌, కమిషనర్‌ హనుమంతరావు చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. సముద్రాల కృష్ణమాచార్యులు (అర్చక పాంచరాత్ర ఆగమం), చెరువు ఆదిత్య (అర్చక వేదిక స్మార్త ఆగమం) ఇద్దరు అర్చకులు ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న ఆధ్వర్యంలో అందుకున్నారు. నియామకమైన అర్చకులకు చైర్మన్‌ పొట్లపల్లి శ్రీధర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు.

సమన్వయంతోనే

గ్రామీణాభివృద్ధి

రఘునాథపల్లి: ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, రైతులు సమన్వయంతో పనిచేస్తే గ్రామీణాభివృద్ధి మరింత వేగవంతమవుతుందని నాబార్డ్‌ జిల్లా అభివృద్ధి మేనేజర్‌ పసుల విజయ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నాబార్డు 45వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురష్కరించుకొని మహిళా సంఘాలు, రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళా సంఘాల సభ్యులకు ఆర్థిక నిర్వహణ, పొదుపు, బ్యాంకు రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు, ఉపాధి యూనిట్ల స్థాపనపై అవగాహన కల్పించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డీపీఎం భవాని, పశు సంవర్ధక శాఖ అధికారి మురళీధర్‌రావు, జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ సత్యనారాయణమూర్తి, సర్పంచ్‌ బొల్లం ఉమారాణి, ఏఓ కరుణాకర్‌, విజయ డెయిరీ డీడీ గోపాల్‌సింగ్‌, బ్యాంకు మేనేజర్లు సంతోష్‌, సతీష్‌, నంద కిశోర్‌, మారి సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎంజీఎం సూపరింటెండెంట్‌గా

రాంకుమార్‌రెడ్డి

కాశిబుగ్గ: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ కాటం రాంకుమార్‌రెడ్డిని నియమిస్తూ శుక్రవారం కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఉత్తర్వులు జారీ చేశారు. ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెంటెండ్‌గా డాక్టర్‌ హరీశ్‌చంద్రారెడ్డి హైదరాబాద్‌కు బదిలీ అయిన తర్వాత కొత్త సూపరింటెండెంట్‌ కోసం అందరూ ఎదురుచూశారు. పలువురు సీనియర్‌ వైద్యుల పేర్లు కూడా పరిగణనలోకి వచ్చాయి. దాదాపు 45 రోజుల నుంచి ఆస్పత్రిలో నెలకొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్‌ సత్యశారద.. డాక్టర్‌ రాంకుమార్‌రెడ్డి సూపరింటెండెంట్‌గా (ఎఫ్‌ఏసీ) అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

స్పోర్ట్స్‌ హాస్టల్‌లో

ప్రవేశాలకు ఎంపికలు

వరంగల్‌ స్పోర్ట్స్‌: తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న క్రీడా అకాడమీలు, ప్రాంతీయ క్రీడా వసతి గృహాల్లో (2026–27) విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఎంపిక ప్రక్రియ చేపడుతున్నట్లు హనుమకొండ డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 97046 69637 మొబైల్‌ నంబర్‌లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement